దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) డిమాండ్‌ను సొమ్ము చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే పర్యావరణ అనుకూల ప్రయోజనాలకు తోడు, చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడం లక్ష్యాలుగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక విధానాలతో ముందుకు వస్తుండడాన్ని చూస్తూనే ఉన్నాము. దీంతో సంప్రదాయ ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ మోడళ్లతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అనుకూల వ్యవస్థల (ఎకోసిస్టమ్) అభివృద్ధికి గతేడాది కరోనా మహమ్మారి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. అయినప్పటికీ లాక్‌డౌన్, ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రావడంతో తిరిగి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ కొన్ని నెలల నుంచి మెరుగుపడుతోంది. కాకపోతే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ప్రధానంగా పట్టణాలు, కొన్ని వాహన విభాగాల్లోనే విక్రయాలు నమోదవుతున్నాయి. అయినా సరే భవిష్యత్తుపై అంచనాలతో ద్విచక్ర ఈవీ మార్కెట్లోకి కొత్త సంస్థలు ఉత్సాహంగా ప్రవేశిస్తుంటే.. కార్ల విభాగంలో టాటా మోటార్స్ దూసుకుపోయే వ్యూహాలను అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల సబ్సిడీ, రాయితీ పథకాలు ఇందుకు కొంత మేర సాయపడుతున్నాయని చెప్పుకోవాలి.
రంగంలోకి కొత్త సంస్థలు
దేశీయ ఈవీ మార్కెట్లో దూకుడుగా వెళ్లే వ్యూహాలతో కొత్త సంస్థలు అడుగుపెడుతుంటే.. మరోవైపు ఆటోమొబైల్ రంగంలో స్థిరపడిన ప్రముఖ కంపెనీలు కూడా పోటీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కార్లు, ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకుని, వృద్ధి చెందేందుకు వేటికవే భిన్నమైన వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మహీంద్రా లీడర్‌గా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆచితూచి అన్నట్టుగా అడుగులు వేస్తోంది. రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీని మహీంద్రా సొంతం చేసుకుని ఈ విభాగంలో ముందు నుంచి ఉన్న సంస్థగా పేరు సొంతం చేసుకున్నప్పటికీ.. త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ‘బోర్న్ ఈవీ’ విధానంతో రానున్న 4–5 ఏళ్ల కాలంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మరింతగా చొచ్చుకుపోయే వ్యూహంతో మహీంద్రా ఉంది.
ఆకర్షణీయంగా లేని ఫేమ్
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో పదుల సంఖ్యలో కంపెనీలు వందకు పైగా మోడళ్లను ఆఫర్ చేస్తుండగా.. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఉన్న మోడళ్లను వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. దీనికి కారణం ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఈవీ) పథకం ఎలక్ట్రిక్ కార్లకు ఆకర్షణీయంగా లేకపోవడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో కేవలం 35,000 వాణిజ్య కార్లకే రాయితీలు రావడం పరిస్థితిని తెలియజేస్తోంది. డిమాండ్ తగినంత లేని పరిస్థితుల్లో పెట్టుబడులతో ప్రయోజనం ఉండదని కార్ల తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అతి తక్కువ విక్రయాల కారణంగా భారతీయ కార్ల తయారీ సంస్థలు ఈవీలకు అవసరమైన కీలక విడిభాగాలను.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ నుంచి పొందడం కష్టమవుతుందని ఐహెచ్‌ఎస్ మార్కిట్‌కు చెందిన దక్షిణాసియా ప్రధాన అనలిస్ట్ సూరజ్ ఘోష్ అన్నారు.
మెట్రోలకే పరిమితమైన ఈవీ టూవీలర్లు
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ప్రధానంగా మెట్రోలు, పట్టణాలకే పరిమితమయ్యాయి. ఎన్నో సంస్థలు డీలర్ల ద్వారా తమ ఉత్పత్తులను పట్టణాల్లో విక్రయిస్తున్నాయి. మరోవైపు సంప్రదాయ కంపెనీలైన టీవీఎస్, బజాజ్‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఒక్కొక్క మోడల్‌నే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. బెంగళూరులో ఏడాది క్రితం టీవీఎస్ ఐక్యూబ్ పేరుతో ఈవీ స్కూటర్‌ను ప్రవేశపెట్టగా.. ఇటీవలే ఢిల్లీ మార్కెట్లోకి ఈ ఉత్పత్తిని విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని మార్కెట్లోకి దీన్ని విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అంటే ప్రస్తుతానికి ఐ క్యూబ్ బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లకే పరిమితం. బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ కూడా ఇంతే. గ్రీవ్స్‌కాటన్‌కు చెందిన యాంపియర్ ఎలక్ట్రిక్ మాత్రం ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో చాలా మోడళ్లను తీసుకొస్తోంది. నెట్‌వర్క్‌నూ విస్తరిస్తోంది. తన ఈవీ వ్యాపార బాధ్యతలను చూసేందుకు యమహా ఇండియా మాజీ మార్కెటింగ్ హెడ్ రాయ్ కురియన్‌ను నియమించుకుంది. ఈ సంస్థకు 230 ప్రాంతాల్లో 300 డీలర్‌షిప్‌లు ఉన్నాయి.
టాటా మోటార్స్ దూకుడు
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగంగా అడుగులు వేస్తోంది. భిన్నమైన విధానంతో ఈవీ కార్ల మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని ఇప్పటికే సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి రెండు ఎలక్ట్రిక్ కార్లు టాటా మోటార్స్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఉండగా, మరిన్ని కార్లను ప్రవేశపెట్టే ప్రణాళికతో సంస్థ ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ రహదారుల్లో ఇప్పటికే 300కు పైగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రముఖ పట్టణాలు, జాతీయ రహదారులపై 2021 మార్చి నాటికి చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 700కు చేర్చాలన్న లక్ష్యంతో ఉంది. ‘‘భారత్ వైవిధ్యమైన మార్కెట్. ఈవీ విలువ ఆధారిత చైన్‌లో ఉత్పత్తులు, సేవల పరంగా అపారమైన వృద్ధి అవకాశాలున్నాయి. ఓఈఎమ్ (ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థలు) కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తుల తయారీ, సదుపాయాలపై పెట్టుబడులను ప్రారంభించాయి. సరైన విధానం, ప్రామాణిక టెక్నాలజీ, నియంత్రణ చర్యలు అన్నవి దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు తోడ్పడతాయి’’ అని ఈవై ఇండియా ఆటోమోటివ్ రంగ పార్ట్‌నర్ వినయ్ రఘునాథ్ తెలిపారు.
ఈవీ జర్నీ.. రయ్!
Published Fri, Feb 19 2021 5:29 AM | Last Updated on Fri, Feb 19 2021 11:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment