భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్‌వేర్ సేవలందించే కంపెనీలో రూ.7.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. టెక్‌జాకీ అనే సాఫ్ట్‌వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ రూ.370 కోట్ల మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్‌పాయింట్ గ్లోబల్ సీఈఓ మానీ రివెలో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ నంగియా తెలిపారు. అయితే మానీ ఎంత ఇన్వెస్ట్ చేశారోమాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా నంగియా మాట్లాడుతూ..‘కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం. ముందుగా రూ.410 కోట్లు సేకరించాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల 10 శాతం తగ్గించి రూ.370 కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తాజాగా సమకూరిన నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూఎస్‌లో కంపెనీని విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడుతాయి’ అని చెప్పారు.
ఆకాష్ నంగియా గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. మెకిన్సేలో పని చేసిన అర్జున్ మిట్టల్ సాయంతో 2017లో టెక్‌జాకీ సాఫ్ట్‌వేర్ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీను స్థాపించారు. ఇది దేశంలోని చిన్న వ్యాపారాల కోసం సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్‌జాకీ మైక్రోసాఫ్ట్, అడాబ్, ఏడబ్ల్యూఎస్, కెక, ఫ్రెష్‌వర్క్స్, మైబిల్ బుక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.125 కోట్లు ఆదాయాన్ని సంపాదించినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో ఇది రూ.170-180 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?
ఇటీవల కేఎల్ రాహుల్ మెటామ్యాన్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జులైలో భారత్‌కు చెందిన న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ ‘సప్లై6’లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో శ్రేయాస్ అయ్యర్ హెల్త్‌టెక్ ప్లాట్‌ఫామ్ ‘క్యూర్‌లో’లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment