ఒమిక్రాన్ తీవ్రత భారత ఎకానమీపై అంతగా ఉండదన్న ఆర్థిక శాఖ ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడం తదితర పరిణామాలు స్టాక్ మార్కెట్‌ను లాభాల ట్రాక్ ఎక్కించాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం(13, డిసెంబర్ 2021) లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండడంతో.. దేశీ స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో నడుస్తున్నాయి. పైగా గత కొన్ని రోజుల దిద్దుబాటు నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.
ఉదయం 10:09 గంటల సమయంలో సెన్సెక్స్ 371 పాయింట్ల లాభంతో 59,158 వద్ద.. నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 17,625 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.59 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా మినహా అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టైటన్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment