బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్‌ ఛార్జీల పేరిట రూ.9700 కోట్లు లూటీ | Indians Paid Rs 9700 Crore In Hidden Forex Fees | Sakshi
Sakshi News home page

బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్‌ ఛార్జీల పేరిట రూ.9700 కోట్లు లూటీ

Published Thu, Oct 28 2021 11:22 AM | Last Updated on Thu, Oct 28 2021 11:34 AM

Indians Paid Rs 9700 Crore In Hidden Forex Fees - Sakshi

హిడ్డెన్‌ ఛార్జీల పేరిట భారీ దోపిడికి పాల్పడుతున్నాయి బ్యాంకులు. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలను లెక్కాపత్రం లేకుండా పక్కదారి పట్టిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించే వారు లేకపోవడంతో శ్రమ జీవుల సంపాదనను జలగల్లా పీల్చేస్తున్నారు బ్యాంకర్లు. 


ఉన్నత విద్య కోసం మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే భారతీయు సంఖ్య పెరుగుతోంది. ఇలా విదేశాల్లో ఉన్నవారికి డబ్బులు పంపే కుటుంబ సభ్యుల నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు, ఎక్సేంజ్‌ మార్క్‌అప్‌ పేరుతో బ్యాంకులు వేల కోట్ల రూపాయలను దోపిడి చేస్తున్నాయి. ఈ విషయాన్ని క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ అనే ఇండిపెండెంట్‌ రీసెర్చ్‌ సంస్థ బయట పెట్టింది. 

విదేశాలకు భారీగా
విదేశాల్లో ఉన్న తమ వారి కోసం భారతీయులు పెద్ద ఎత్తున నగదును పంపిస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తం 12.7 బిలియన్‌ డాలర్లు ( సుమారు 95 వేల కోట్లు)గా ఉంది. ఇందులో అత్యధికంగా 3.8 బిలియన్‌ డాలర్లు ఉన్నత విద్య కోసం వెచ్చిస్తుండగా ఆ తర్వాత ట్రావెల్‌ (3.2 బిలియన్‌), ఫ్యామిలీ సపోర్ట్‌ (2.7 బిలియన్‌) డాలర్లు ఉన్నాయి.

తగ్గిస్తున్నామంటూనే
విదేశాలకు డబ్బు పంపే విషయంలో ఛార్జీలు తగ్గిస్తున్నామని కొన్నేళ్ల కిందట బ్యాంకులు ప్రకటించాయి. దీంతో వాటి ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2016లో ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.15,017 కోట్లు వసూలు అవగా 2019లో ఈ మొత్తం 12,142 కోట్లకు పడిపోయింది. దీంతో ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎక్సేంజీ మార్క్‌అప్‌ పేరుతో వసూలు చేసే హిడ్డెన్‌ ఛార్జీలను ఒక్కసారిగా పెంచాయి బ్యాంకులు. 2016లో ఎక్సేంజీ మార్కప్‌ ఛార్జీల మొత్తం రూ.2,505 కోట్లు ఉండగా 2019కి వచ్చే సరికి రూ.4,422 కోట్లకు పెరిగింది. ఇలా ఓ వైపు ప్రాసెసింగ్‌ ఛార్జీలు తగ్గించామని చెబుతూనే మరోవైపు వడ్డన కార్యక్రమం చేపడుతున్నాయి బ్యాంకులు.  దీంతో బ్యాంకుల కాసుల పెట్టె గలగలమంటోంది. 2020 ఏడాదికి సంబంధించి విదేశీలకు నగదు చెల్లించే సమయంలో ఎక్సేంజీ మార్క్‌అప్‌ పేరుతో రూ.9,700 కోట్ల రూపాయలు అనధికారికంగా వసూలు చేసినట్టు క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ సంస్థ తెలిపింది. ఈ ఏడాది విదేశీ చెల్లింపులకు సంబంధించి ప్రాసెసింగ్‌ ఫీజుగా బ్యాంకులు రూ.26,300 కోట్లు వసూలు చేశాయి. ఇందులో హిడ్డెన్‌ ఛార్జెస్‌ పేరుతో వసూలు చేసిన రూ.9,700 వాటా 36 శాతంగా ఉంది. 

ఎక్సేంజీ మార్క్‌అప్‌
విదేశాలకు డబ్బు పంపివ్వడం లేదా అక్కడి నుంచి నగదు స్వీకరించే సమయంలో బ్యాంకులు ఎక్సేంజీ మార్క్‌అప్‌ పేరుతో ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలరు - రూపాయిల మధ్య మారకం విలువ ఎప్పుడు స్థిరంగా ఉండదు. దీంతో ఎక్సేంజీ మార్కప్‌ ఛార్జీలను వీటిని నేరుగా కాకుండా  హిడ్డెన్‌ ఛార్జీలుగా బ్యాంకులు వసూలు చేస్తున్నాయి.  అదనపు ఆదాయం కోసం ఈ ఎక్సేంజీ మార్క్‌అప్‌ ఛార్జీలను పెంచడం ద్వారా బ్యాంకులు తమ వినియోగదారుల జేబుల్లో చేతులు పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

శ్రమజీవుల కష్టం
గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్న భారతీయుల్లో నూటికి 90 శాతం మంది శ్రమ జీవులే. ఇండియాలో తమ కుటుంబాలకు ఆసరగా ఉంటూ కాయకష్టం చేసి నగదు ఇండియాకు పంపిస్తున్నారు. కానీ వీళ్ల దగ్గరి నుంచి కూడా భారీ మొత్తంలో ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. 2016లో ప్రాసెసింగ్‌ ఫీజు మొత్తం రూ.10,200 కోట్లు ఉండగా 2020కి వచ్చే సరికి ఇది రూ.14,000 కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి సంబంధించి రెమిటెన్స్‌ కోటాలో వసూలు చేసిన హిడ్డెన్‌ ఛార్జెస్‌ విలువ రూ. 4,200 కోట్ల నుంచి రూ.7,900 కోట్లకు చేరుకుంది.

టెక్నాలజీ పెరిగినా
ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు సుళువుగా జరిగిపోతున్నాయి. ప్రాసెసింగ్‌ ఫీజులు కూడా తగ్గిపోతున్నాయి. కానీ విదేశాలకు నగదు చెల్లింపులు, స్వీకరణ చేసేప్పుడు మాత్రం వసూలు చేస్తున్న ప్రాసెసింగ్‌ ఫీజు, హిడ్డెన్‌ ఛార్జీలు పెరుగుతూ పోతున్నాయి. 


చదవండి: పీబీ ఫిన్‌టెక్‌ ఐపీవో నవంబర్‌ 1న ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement