న్యూఢిల్లీ: భారత్ వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో చక్కటి వృద్ధి బాటన పయనిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) తాజా ప్రకటనలో పేర్కొంది. పటిష్ట ఆర్థిక ఫండమెంటల్స్ (మూలాధారాలు) ఇందుకు దోహదపడతాయని వివరించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ’ సావరిన్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు)
ఎస్‌అండ్‌పీ తాజా ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
♦ఎస్‌అండ్‌పీ ఇస్తున్న ‘స్టేబుల్ అవుట్‌లుక్’ భారత్ పటిష్ట ఎకానమీని, ఆదాయ వృద్ధిని ప్రతిబింబిస్తోంది. బలహీన ఫైనాన్షియల్ అంశాల వల్ల ప్రతికూలతలు ఏర్పడకుండా పటిష్ట ఎకానమీ, ఆదాయాలు భరోసాను ఇస్తున్నాయి.
♦ దీర్ఘకాలిక, ‘ఏ–3’ షార్ట్–టర్మ్ ఫారెన్, లోకల్ కరెన్సీలకు ‘బీబీబీ’ సావరిన్ క్రెడిట్ రేటింగ్ కొనసాగిస్తున్నాం.
♦సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును కనబరుస్తోంది. రాబోయే రెండు లేదా మూడు సంవత్సరాలలో వృద్ధిని బలపరిచేందుకు భారత్ పటిష్ట ఫండమెంటల్స్ దోహదపడతాయని అంచనావేస్తున్నాం.
♦ ప్రభుత్వ–ఆదాయాలు వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, రుణ భారాల వంటి అంశాలను స్థిరీకరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, ఇవి మరికొంత కాలం అధికంగానే కొనసాగే వీలుంది.
పెట్టుబడులకు కీలకం...
భారత్ సావరిన్ రేటింగ్ విషయంలో యథాతథ వైఖరిని అవలంభిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ ఈ నెల ప్రారంభంలో చేసిన ప్రకటన నేపథ్యంలోనే ఎస్‌అండ్‌పీ తాజా ప్రకటనలో వెలువడింది. చక్కటి వృద్ధి తీరు, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని నిలబడ్డం వంటి అంశాల నేపథ్యంలో రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది.
అయితే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల విషయంలో పరిస్థితి బలహీనంగా ఉందని కూడా హెచ్చరించింది. తాజాగా ఎస్‌అండ్‌పీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు ఎస్‌అండ్‌పీ ‘బీబీబీ’ సావరిన్ రేటింగ్, అలాగే ఫిచ్ ఇస్తున్న ‘బీబీబీ మైనస్’ రేటింగ్‌లు రెండూ అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్. చెత్త రేటింగ్‌కు ఒక అంచె అధికం. మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-మూడీ స్ కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్‌ను ఇస్తోంది. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్)
అంతర్జాతీయంగా దేశంలోకి పెట్టుబడులు రావడానికి ఆయా సంస్థలు ఇచ్చే రేటింగ్స్ కీలకం. రేటింగ్ పెంపునకు కేంద్ర అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రతిస్పందన రావడం లేదు. దీనితో భారత్‌కు సంబంధించి రేటింగ్ వచ్చే విషయంలో హేతుబద్దత కనబడ్డంలేదన్న విమర్శలూ తలెత్తుతున్నాయి. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు)
ఎకానమీపై ఐక్యరాజ్యసమితి విశ్వాసం
భారత్ ఆర్థిక వ్యవస్థపై ఐక్యరాజ్యసమితి పూర్తి విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. 2023లో 5.8 శాతం, 2024లో 6.7 శాతం వృద్ధిని దేశం నమోదుచేసుకుంటుందని ‘ఆర్థిక పరిస్థితులు-అవకాశాలు’ శీర్షికన రూపొందించిన ఒక తాజా నివేదికలో తెలిపింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని నివేదికలో అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ వృద్ధికి దోహదపడే ప్రధాన అంశంగా వివరించింది.
అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో భారత్ ఎకానమీ ప్రకాశవంతంగా కొనసాగుతోందని ప్రశంసించింది. 2023లో భారత్‌లో ద్రవ్యోల్బణం సగటును 5.5%గా ఉంటుందని అభిప్రాయపడుతూ తగ్గుతున్న అంతర్జాతీయ కమోడిటీ ధరలు, కరెన్సీ క్షీణత నెమ్మదించడం ఇందుకు కారణంగా ఉంటాయని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2023లో 2.3%, 2024లో 2.5% వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది.
మరింత బిజినెస్ సమాచారం కోసం చదవండి : సాక్షి బిజినెస్
Comments
Please login to add a commentAdd a comment