
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.91 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శ్రేణిలోనే నవంబర్ ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, గడచిన మూడు నెలల్లో ఈ స్థాయిలో ఈ అంకెలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలే దీనికి కారణమని సోమవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ఆగస్టులో 5.3 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 4.35 శాతానికి తగ్గింది. అయితే అక్టోబర్‌లో స్వల్పంగా 4.48 శాతానికి ఎగసింది. రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా ఆర్‌బీఐ వరుసగా తొమ్మిది ద్వైమాసిక సమావేశంలోనూ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తాజా ప్రకటనలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► నవంబర్‌లో ఫుడ్ బాస్కెట్ ధర 1.87 శాతం పెరిగితే, అక్టోబర్‌లో ఈ పెరుగుదల రేటు 0.85 శాతంగా ఉంది. 2020 నవంబర్‌లో ఈ రేటు ఏకంగా 9.5 శాతం.
► గత ఏడాది నవంబర్‌తో పోల్చితే తాజా సమీక్షా నెల్లో కూరగాయల ధరలు తగ్గాయి. అయితే నెలవారీగా (2021 అక్టోబర్‌తో పోల్చి) ధరలు పెరిగాయి.
► ఆయిల్, ఫ్యాట్ విభాగంలో వార్షికంగా ధర 29.67 శాతం పెరిగింది. అయితే ఈ పెరుగుదల రేటు అక్టోబర్‌తో పోల్చితే తక్కువ.
► అక్టోబర్‌తో పోల్చితే పండ్ల ధరలు పెరిగాయి.
ఆర్‌బీఐ అంచనాలు ఇలా...
ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా కొనసాగుతుందని, మూడు, నాలుగు త్రైమాసికాల్లో 5.1%, 5.7%గా ఉంటుం దని ఆర్‌బీఐ అంచనావేసింది. 2022–23 క్యూ1, క్యూ2లలో 5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment