దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణంలోని వేడిగాలుల వల్ల దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దిల్లీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల విమానప్రయాణాల్లో అంతరాయం ఏర్పడుతోందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం మధ్యాహ్నం 2:10 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో ఉన్న బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం సాయంత్రం 6:15గంటలకు బయలుదేరింది. దిల్లీలో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. సోమవారం 45డిగ్రీల ఉష్ణోగ్రతతో గాలులు వీయడం వల్ల ప్రయాణంలో అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ..‘అధిక ఉష్ణోగ్రతల వల్ల దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లే ఇండిగో విమానం 6E 2521 ప్రయాణం ఆలస్యమైంది. ఇండిగో అన్నింటికంటే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వేడిగాలులతో కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఆలస్యం అనివార్యమైంది. సంస్థ నిత్యం ప్రయాణికులకు సమాచారం అందిస్తుంది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని చెప్పారు.
హీట్ వేవ్స్
ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ప్రకారం..వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులపాటు సగటు ఉష్ణోగ్రత కంటే గరిష్ఠ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు అధికంగా నమోదైతే దాన్ని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. ప్రభావిత ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత రెండు రోజుల పాటు వరుసగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే అది వేడి గాలులుగా మారే ప్రమాదముందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ హీట్‌వేవ్‌ను ‘నిశ్శబ్ద విపత్తు’ అని కూడా పిలుస్తారు. భారత్‌లో హీట్‌వేవ్స్ సాధారణంగా మార్చి-జూన్ మధ్య, అరుదైన సందర్భాల్లో జులైలోనూ సంభవిస్తాయి. ఇటీవల దిల్లీలోని నరేలాతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు దిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment