న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక రంగ ప్రముఖులు, ఏషియన్ పెయింట్స్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మాజీ చైర్మన్ అశ్విన్ డానీ (81) తుది శ్వాస విడిచారు. 1968 నుండి ఏషియన్ పెయింట్స్‌తో డానీకి అనుబంధం ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కంపెనీలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, నాన్–ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌తో సహా కంపెనీ బోర్డ్‌లో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. 2018 నుండి 2021 మధ్య డానీ ఏషియన్ పెయింట్స్ సంస్థకు, బోర్డ్‌కు చైర్మన్‌గా ఉన్నారు. డానీ తండ్రి సూర్యకాంత్ ఏషియన్ పెయింట్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. వివిధ ప్రభుత్వ– వాణిజ్య సంస్థల్లో డానీ కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు అవార్డులు అందుకున్నారు.
సీఎన్‌బీసీ–టీవీ 18 లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, బిజినెస్ ఇండియా మ్యాగజైన్ బిజినెస్‌మెన్ ఆఫ్ ది ఇయర్ (2015), ఇండియన్ పెయింట్ అసోసియేషన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2002లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ నుండి కెమినార్ అవార్డు ఇందులో ఉన్నాయి. తాజా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అశ్విన్ డానీ, ఆయన కుటుంబం 7.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 64,000 కోట్లు) నికర విలువను కలిగి ఉంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా 293వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment