ముంబై: దేశీయ స్టాక్ సూచీలకు లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో గురువారం దాదాపు ఒక శాతం నష్టపోయాయి. ఉదయం లాభాల్లో మొదలైన సూచీలు.., కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెపె్టంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో రోజంతా సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఫలితంగా సెన్సెక్స్ 610 పాయింట్లు నష్టపోయి 65,508 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 695 పాయింట్లు క్షీణించి 65,423 వద్ద నిలిచింది. ఈ సూచీ దాదాపు పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.95 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.316 లక్షల కోట్లకు దిగివచ్చింది.
ఈ సూచీలో 30 షేర్లకు గానూ అయిదు షేర్లు మాత్రమే లాభ పడ్డాయి. నిఫ్టీ 193 పాయింట్లు పతనమై 19,524 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 224 పాయింట్లు నష్టపోయి 19,492 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,364 కోట్లు అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,711 కోట్ల ఈక్విటీలు కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ స్వల్పంగా మూడు పైసలు పెరిగి 83.19 వద్ద స్థిరపడింది. అధిక వడ్డీరేట్ల పెంపు అంచనాలకు తోడు తాజాగా బ్యారెల్ చమురు ధర 100 డాలర్లకు చేరువవడం, చైనాలో ప్రాపర్టీ మార్కెట్ సంక్షోభ ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది.
‘‘అధిక వెయిటేజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి తోడు ప్రతికూల ప్రపంచ సంకేతాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఎన్‌ఎస్‌ఈ సూచీల్లో స్టాక్స్ వెయిటేజీకి సంబంధించిన మార్పులు అమల్లోకి వస్తుండటంతో దీని అనుగుణంగా ట్రేడర్ల తమ పొజిషన్లను సవరించుకున్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర ఈ ఏడాది(2023) గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. మార్కెట్లో అస్థిరతలను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ 4 నెలల గరిష్టానికి చేరుకోవడం ప్రతికూలంగా మారింది. ఒకవేళ నిఫ్టీ 19,500 స్థాయిని కోల్పోతే ఆగస్టు కనిష్టం 19,220 స్థాయికి దిగిరావచ్చు’’ అని రిలిగేర్ బ్రోకరింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు..
► యాత్రా ఆన్‌లైన్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.142)తో పోలిస్తే 8% డిస్కౌంట్‌తో రూ.130 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో పదిశాతానికి పైగా నష్టపోయి రూ.127 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 4% నష్టంతో రూ.136 వద్ద నిలిచింది. కంపెనీ విలువ రూ.2,133 కోట్లుగా నమోదైంది. ఎక్సే్చంజీలో 7.43 లక్షల ఈక్విటీలు చేతులు మారాయి.
► ఐటీ రంగ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా 4%, ఎంఫసిస్ 3%, ఎల్‌టీఐఎం 2.50%, విప్రో 2% పర్‌సిస్టెంట్, ఇన్ఫోసిస్ టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కోఫోర్జ్ షేర్లు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఐటీ సూచీ
అత్యధికంగా రెండుశాతం క్షీణించింది
► అధిక వెయిటేజీ రిలయన్స్(1.50%), ఐటీసీ(2%), ఇన్ఫోసిస్ (2%), టీసీఎస్(1.50%) మారుతీ సుజుకీ, కోటక్ బ్యాంక్ షేర్లు ఒకశాతం నష్టపోయి సూచీల భారీ పతనానికి
కారణమయ్యాయి.
► నష్టాల మార్కెట్లోనూ ఎల్‌అండ్‌టీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో మూడుశాతం ర్యాలీ చేసి రూ.3051 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి ఒకటిన్నర శాతం లాభపడి రూ.3012 వద్ద నిలిచింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన సూచీ ఇదే.
Comments
Please login to add a commentAdd a comment