సాక్షి,ముంబై: దేశీయ రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్నిస్థాయిలలో జీతాల పెంపు, పదోన్నతులు కల్పిస్తున్నట్టు తెలిపింది. అలాగే జూనియర్లకు ఇన్సెంటివ్ లను అందజేయనున్నట్టు ప్రకటించింది. బుధవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజా నిర్ణయంతో 2.40 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. (ఫలితాల్లో అదరగొట్టిన ఇన్ఫీ)
రెండవ త్రైమాసికంలో ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు 100 శాతం వేరియబుల్ పే కూడా అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. జూనియర్ ఉద్యోగులకు క్యూ 3 లో ఒకసారి ప్రత్యేక ప్రోత్సాహాన్ని చెల్లిస్తామని ఇన్ఫోసిస్ సీఎండీ సలీల్ పరేఖ్ వర్చువల్ బ్రీఫింగ్ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల నిబద్ధత అద్వితీయం అంటూ ప్రశంసలు కురిపించారు. జీతాల పెంపు ప్రక్రియ, 2021 జనవరి 1నుండి అమలులోకి వస్తుందన్నారు. గత త్రైమాసికంలో ప్రమోషన్లను నిలిపివేసామని, కానీ ఇపుడు అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులు కల్పిస్తామన్నారు. జీతాల పెంపు మునుపటి సంవత్సరాల మాదిరిగానే ఉంటుందని ఇన్ఫీ సీఓఓ ప్రవీణరావు తెలిపారు. గత ఏడాది, భారతదేశంలో ఇన్ఫోసిస్ సగటు వేతనాల పెంపు 6 శాతంగా ఉంది. 2020 సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి 2,40,208 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగా కరోనా సంక్షోభం, వ్యాపారంలో మందగమనం నేపథ్యంలో ప్రమోషన్లు, జీతాల పెంపును నిలిపివేస్తున్నట్లు ఇన్ఫోసిస్ గతంలో ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment