రియల్టీ పెట్టుబడులపై రాబడి మన దగ్గరే ఎక్కువ | Institutional investors betting big on alternative realty assets | Sakshi
Sakshi News home page

రియల్టీ పెట్టుబడులపై రాబడి మన దగ్గరే ఎక్కువ

Published Sat, Feb 5 2022 4:30 AM | Last Updated on Sat, Feb 5 2022 3:21 PM

Institutional investors betting big on alternative realty assets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదేశీ పెట్టుబడుల ఆకర్షణీయమైన ప్రాంతంగా భారత్‌ నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే రియల్టీ పెట్టుబడులపై ఎక్కువ రాబడి మన దగ్గర్నుంచే కనిపిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కొలియర్స్‌ తెలిపింది. 2030 నాటికి ఇండియా మూడో అతిపెద్ద వినియోగదారు ఆర్ధిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది పారిశ్రామిక రంగంలో నూతనోత్సాహాన్ని నింపుతుందని పేర్కొంది. సాంకేతికత దేశం బలంగా ఉన్నప్పటికీ.. నెమ్మదిగా తయారీ రంగానికి గమ్యస్థానంగా మారుతోందని తెలిపింది.

డేటా సెంటర్, సీనియర్‌ లివింగ్, స్టూడెంట్‌ హౌసింగ్, కోలివింగ్‌ వంటి ప్రత్యామ్నాయ రియల్‌ ఎస్టేట్‌ విభాగాలలో పెట్టుబడుల వరద పారుతోంది. సాంకేతిక వినియోగం పెరగడంతో డేటా భద్రత చట్టం అనివార్యమైంది. దీంతో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెరిగాయని కొలియర్స్‌ ఇండియా డైరెక్టర్‌ పీయూష్‌ గుప్తా తెలిపారు. గతేడాది దేశీయ ప్రత్యామ్నాయ రియల్టీలో 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని రిపోర్ట్‌ వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 26 శాతం మేర వృద్ధిరేటని పేర్కొంది.

అధిక నాణ్యత, సాంకేతికత, పాలన, కస్టమర్‌ సర్వీస్‌లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. డేటా వేర్‌హౌస్‌లు, షేర్డ్‌ స్పేస్‌ (రెసిడెన్షియల్‌ లేదా కమర్షియల్‌), ప్రాప్‌టెక్‌ వంటి కొత్త వ్యాపారాలు ఊపందుకున్నాయి. మెరుగైన పాలన, గడువులోగా డెలివరీలు, నగదు లభ్యతతో నివాస సముదాయాల మార్కెట్లో సానుకూలత తిరిగొచ్చింది. నివాస రంగంలో 900 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగేళ్లలో అత్యధికం. పెట్టుబడిలో అందుబాటు, మధ్యతరగతి గృహాలు 64 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ–కామర్స్‌ డిమాండ్‌తో గత ఐదేళ్లలో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలో గరిష్ట స్థాయిలో 1.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడిదారులు, డెవలపర్లు, ప్రాపర్టీ యజమానులు స్థిరమైన అభివృద్ధి వైపు దృష్టిసారించారు. దేశంలో గ్రీన్‌ బాండ్లు, గ్రీన్‌ ఫైనాన్సింగ్‌ ఎక్కువ ఆమోదం పొందుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement