
న్యూఢిల్లీ: దేశీయంగా నాలుగేళ్లలో అగ్రిటెక్ స్టార్టప్‌లు పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. 2020 కల్లా వీటిలో రూ. 6,600 కోట్ల పెట్టుబడులు ప్రవహించినట్లు తెలియజేసింది. వ్యవసాయ సంబంధ వేల్యూ చైన్‌లో సామర్థ్యాలను మెరుగుపరచగల అగ్రిటెక్ స్టార్టప్స్‌కు అపార వృద్ధి అవకాశాలుండటం ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేసింది. గతంలో దేశీ వ్యవసాయ రంగం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చింది. అయితే కొత్త సాంకేతికతలు ప్రవేశించడంతోపాటు.. ఖచ్చితమైన సమా చారం అందుబాటులోకి రావడంతో కొత్త వృద్ధి దశలోకి మళ్లినట్లు వివరించింది. ‘దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆవిష్కరణలు– వ్యవసాయం, గ్రామీణ ఫైనాన్స్‌లో సమీకృత వృద్ధికి ఊతమిస్తున్న బిజినెస్ విధానాలు’ పేరుతో వెలువడిన నివేదిక ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. బెయిన్ అండ్ కంపెనీ, సీఐఐ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. వీటి ద్వారా రానున్న కొన్నేళ్లలో దేశీ వ్యవసాయ రంగం భారీ మార్పుల (ట్రాన్స్‌ఫార్మేషన్)కు లోనుకానున్నట్లు అంచనా వేసింది.
ఎఫ్‌పీవోలకు పాత్ర
దేశ వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న చర్యలు గ్రామీణ వేల్యూ చైన్‌లో రైతు ఉత్పాదక సంస్థల(ఎఫ్‌పీవోలు) పాత్రను మరింత విస్తృతం చేయనున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. పంటల దిగుబడి తదుపరి మౌలిక సదుపాయాలను విస్తరించనున్నాయి. రియల్ టైమ్ గణాంకాలు, డేటా ఆధారంగా నిర్ణయాలకు వీలుంటుంది. రైతుల విశ్వాసం పెంపొందుతుందని, తద్వారా ట్రాన్స్‌ఫార్మేషన్ ఒక సహకార ప్రక్రియగా నిలుస్తుందని నివేదిక తెలియజేసింది. సామర్థ్య మెరుగు, రుణ లభ్యతకు వీలుగా ఈ రంగంలోకి దేశ, విదేశీ పెట్టుబడులు భారీగా ప్రవహిస్తున్నట్లు తెలియజేసింది. నాలుగేళ్లలో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ పెట్టుబడులు వ్యవసాయ రంగంలోకి దూసుకొస్తున్నట్లు పేర్కొంది. 2020కల్లా లభించిన రూ. 6,600 కోట్ల పెట్టుబడుల్లో పీఈ వాటా వార్షికంగా 50 శాతం చొప్పున వృద్ధి చూపినట్లు వివరించింది.