సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపడింది. అటు ఎనలిస్టులు కూడా లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితుందని భావిస్తున్నారు.వరుసగా నాలుగో రోజు కరోనా కొత్త కేసులు లక్ష మార్క్‌కు దిగి రావడం, చక్కటి వర్షపాతం వార్తలతో వరుసగా రెండవ సెషన్‌లోనూ దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగింది. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేశాయి. ఫలితంగా బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ ఈ రోజు రికార్డు స్థాయిలో 231.52 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది మార్చి 23 కనిష్టంతో పోలిస్తే ఇది 129.66 లక్షల కోట్ల రూపాయలు లేదా 127.29శాతం ఎక్కువ. అంటే గత14 నెలల్లో స్టాక్ మార్కెట్ , పెట్టుబడిదారుల సంపదలో గణనీయంగా పుంజుకుందన్నమాట.
శుక్రవారం సెన్సెక్స్ 52,641 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 15,835 జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 న సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 52,516వద్ద, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిని 15,431ని తాకింది. సెన్సెక్స్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి 10.09శాతం లేదా 4,816 పాయింట్లు సాధించింది. నిఫ్టీ 13.24శాతం లేదా 1,851 పాయింట్లు పెరిగింది. ఒక సంవత్సరంలో 59.86 శాతం లేదా 5,922 పాయింట్లు ఎగిసింది. ఈ రికార్డుర్యాలీ తరువాత ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. మరికొంతమంది మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందని సెలక్టివ్‌గా పెట్టుబడులను కొనసాగించాలని భావిస్తున్నారు.
అన్‌లాక్ ప్రక్రియ, దేశంలో ప్రజలందరికీ టీకాలు పూర్తియితే ఆర్థిక పునరుజ్జీవనంపై యస్ సెక్యూరిటీస్ సీనియర్ ప్రెసిడెంట్, రీసెర్చ్ , ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ అమర్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మార్కెట్ టాప్ 10 హెవీవెయిట్ స్టాక్‌లలో ర్యాలీ ఉంటుందని.. ఇప్పటికే ఆరు నెలల విరామం తర్వాత ఆర్‌ఐఎల్ ఆ దశలో ముందుందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో సెన్సెక్స్ డిసెంబర్ 2021 నాటికి 60వేలకు చేరుతుదని వ్యాఖ్యానించారు. జెఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్, టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్, రాహుల్ శర్మ కూడా మార్కెట్ భవిష్యత్తు సానుకూల అంచనాలను ప్రకటించారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన వికె విజయకుమార్ మాట్లాడుతూ మిడ్, స్మాల్ క్యాప్ జోరు ఆందోళన కలిగించే అంశమన్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ 2017లో చిన్న సూచిక 60శాతం పెరగడాన్ని గుర్తు చేశారు. స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా ఆర్థిక, ఐటీ, ఫార్మా, మెటల్ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. సానుకూల గ్లోబల్ మార్కెట్లు, తగ్గుతున్న కోవిడ్ కేసులు, అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సడలింపులు, మంచి మాన్‌సూన్స్ మధ్య సెన్సెక్స్ ఓవర్‌బాట్ స్థాయికి చేరుకుందని టిప్స్ 2 ట్రేడ్స్ సహ వ్యవస్థాపకుడు, ట్రైనర్ ఎ.ఆర్.రామచంద్రన్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ప్రస్తుత స్థాయిలో లాభాల స్వీకరణకు దిగుతారన్నారు. రానున్న వారంలో 52170 వద్ద నిఫ్టీ బలమైన మద్దతు స్థాయిగా అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment