
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం అందించేందుకు గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్) దాఖలు చివరి తేదీని జూలె 31 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అలాగే సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఇప్పటికే పన్ను చెల్లింపుదారులు అదనపు వడ్డీ, ఆలస్య రుసుములను చెల్లించినట్లయితే వాటిని రీఫండ్ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.
జూలై 31 తర్వాతి నుంచి ఆలస్య రుసుములు, వడ్డీలు వసూలు చేస్తున్నారని కొంతమంది ట్యాక్స్‌పేయర్లు ఫిర్యాదులు చేశారని.. ఈనెల ఒకటో తేదీన సాఫ్ట్‌వేర్ లోపం సరిదిద్దామని ఐటీ శాఖ ట్వీట్‌లో పేర్కొంది. లేటెస్ట్ వెర్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు సూచించింది. ఇప్పటికే ఎవరైనా ట్యాక్స్‌పేయర్లు అదనపు వడ్డీ లేదా ఆలస్య రుసుములతో ఐటీఆర్‌లను సమర్పించినట్లయితే సీపీసీ–ఐటీఆర్ ప్రాసెస్‌లో సరిచేయబడుతుందని.. ఏదైనా అదనపు చెల్లింపులుంటే వాటిని సాధారణ కోర్స్‌లో రీఫండ్ చేస్తామని ఐటీ శాఖ వివరించింది.