న్యూఢిల్లీ: తొలి మూడు పారిశ్రామిక విప్లవాలను అందుకోలేకపోయినప్పటికీ జియో ఊతంతో నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సారథ్యం వహించగలిగే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. పుష్కలమైన ఐటీ సామర్థ్యాలు, అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, చౌక స్మార్ట్ డివైజ్‌ల కలయిక ఇందుకు దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సారథ్యం వహించేందుకు కావల్సిన సరంజామాను సమకూర్చే ఉద్దేశంతోనే జియో రూపకల్పన జరిగిందని అంబానీ చెప్పారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
‘దేశం ఎదుర్కొంటున్న డేటా కష్టాలకు ముగింపు పలకాలని, డిజిటల్ విప్లవాన్ని తేవాలని లక్ష్యంగా పెట్టుకుని జియో ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతంగా, విస్తృతంగా కవరేజీ ఇచ్చే ప్రపంచ స్థాయి డిజిటల్ నెట్‌వర్క్‌ను మేం నిర్మించాం‘ అని అంబానీ చెప్పారు. 2జీ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు దేశీ టెలికం రంగానికి 25 ఏళ్లు పడితే... తాము కేవలం మూడేళ్లలోనే సొంత 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నామని తెలిపారు. ‘నేడు భారత్‌లో డేటా వినియోగం ప్రతి నెలా 6 ఎక్సాబైట్ల పైగా ఉంటోంది. జియో రావడానికి పూర్వం.. నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే ఇది 30 రెట్లు ఎక్కువ. మొబైల్ డేటా వినియోగానికి సంబంధించి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భారత్ 155వ ర్యాంకు నుంచి అగ్రస్థానానికి చేరింది‘ అని అంబానీ చెప్పారు. తద్వారా అధునానత టెక్నాలజీలను అమలు చేసేందుకు భారత్ ఇంకా సిద్ధంగా లేదన్న అపోహలను జియో పటాపంచలు చేసిందన్నారు.
డిజిటల్ విప్లవానికి భారత్ సారథ్యం
Published Fri, Oct 9 2020 4:44 AM | Last Updated on Fri, Oct 9 2020 4:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment