వాషింగ్టన్: డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ వేదికలు, సోషల్ మీడియా ద్వారా విద్వేషం, హింసపూరిత వాతావరణం పెరిగిపోతుందన్న ఆరోపణల నేపథ్యంలో టెక్ దిగ్గజాలు అమెరికన్ సెనేట్ విచారణ కమిటీ ఎదుట హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో బుధవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తమ వాదనలు వినిపించారు. వీరిలో ఫేస్‌బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌లతో పాటు అమెజాన్ అధినేత, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో తొలి సారిగా ఈ మీటింగ్‌కు హాజరైన బెజోస్‌ను విచారణ కమిటీ.. అమెరికా కంపెనీల సాంకేతికత, సమాచారాన్ని చైనా ప్రభుత్వం చోరీ చేస్తుందా అని ప్రశ్నించగా ఆయన నుంచి స్పందన రాలేదు.(ఆన్‌లైన్ వేదికల దుర్వినియోగంపై ఆందోళన)
ఈ క్రమంలో ఫ్లోరెడ్ రిపబ్లికన్ గ్రెగ్ స్ట్రేబ్.. ‘‘మిస్టర్ బెజోస్.. మీరు మ్యూట్‌లో ఉన్నారు’’అంటూ బెజోస్‌కు గుర్తు చేశారు. దీంతో వెంటనే తేరుకున్న బెజోస్.. అన్‌మ్యూట్ చేసి.. ‘‘క్షమించండి. కొన్ని ఖరీదైన వస్తువులకు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారని విన్నాను. అయితే ఇందులో డ్రాగన్ ప్రభుత్వ ప్రమేయం ఉందో లేదో తెలియదు’’ అని బదులిచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఈ- కామర్స్ బిజినెస్ మ్యాన్‌కు అన్‌మ్యూట్ చేయాలనే విషయం తెలియదా లేదా ఆ సమయంలో స్నాక్స్ తినడానికి వెళ్లారా.. అదీ కాదంటే విచారణ కమిటీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది.. సైలెంట్‌గా ఉన్న సమయంలో ఆయన ఎన్ని మిలియన్ డాలర్లు సంపాదించారో అంటూ బెజోస్ సంపాదనను లెక్కలేసే పనిలో పడ్డారు. (2026 నాటికి జెఫ్ బెజోస్, మరి ముకేశ్ అంబానీ?)
ఇప్పుడే చెప్పలేం
ఇదిలా ఉండగా.. అమెరికా- చైనాల మధ్య వాణిజ్య, దౌత్య యుద్ధం ముదురుతున్న వేళ అగ్రరాజ్యం ఇప్పటికే డ్రాగన్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. డేటా చౌర్యానికి పాల్పడుతుందనే కారణంతో చైనీస్ కంపెనీ హువావేను నిషేధించడం సహా జాతీయ భద్రత దృష్ట్యా మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైనట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో.. టెక్ దిగ్గజాలను అడిగిన పలు ప్రశ్నల్లో డ్రాగన్ ప్రస్తావన రావడం గమనార్హం. ఈ క్రమంలో తమకు సంబంధించిన సాంకేతికతను చైనా ప్రభుత్వం దొంగిలించిందన్న విషయంలో ప్రాథమిక నిర్దారణకు రాలేమని జుకర్‌బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment