సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ ఇది. 2024లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలపడం అన్నమాట. కాబట్టి ఓ విధంగా మోదీ సర్కారుకు ఈ పర్యాయం ఇదే చివరి బడ్జెట్ కానుంది.
సాధారణంగా రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగినప్పుడు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సహజం. దీనికితోడు గత బడ్జెట్‌లలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రకటనలేవీ లేవు. ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో కీలక ప్రకటనలు లేకపోయినప్పటికీ ఉన్నంతలో మధ్యతరగతిని ఆకట్టుకుంటూనే ఉపాధి కల్పన, వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్‌ను రూపొందించడం ఆమె ముందున్న సవాలు. ఇందుకోసం నిర్మలా సీతారామన్, ఆమె టీమ్ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆమె టీమ్‌లో ఎవరు ఉన్నారు? వారి పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం..
నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ మంత్రి
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా ఘనత సాధించారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన నిర్మల.. కెరీర్ తొలినాళ్లలో లండన్‌లోని ఓ స్టోర్‌లో పనిచేశారు. తర్వాత యూకేలో అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్‌లో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా, తర్వాత రక్షణశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు.
టీవీ సోమనాథన్, ఆర్థిక శాఖ కార్యదర్శి
తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్. గతంలో కార్పొరేట్ వ్యవహారాల జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 2015-17 మధ్య ప్రధాని కార్యాలయంలోనూ పనిచేశారు. కలకత్తా యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన సోమనాథన్ ప్రపంచ బ్యాంక్‌లోనూ విధులు నిర్వర్తించారు. బడ్జెట్ బృందంలోని కీలక వ్యక్తుల్లో అత్యంత సీనియర్ ఈయనే. ప్రభుత్వం ప్రకటించే పథకాల వ్యయాలను అంచనా వేసేది ఈయనే. మరి ఈసారి బడ్జెట్ ఖర్చులను ఎలా రూపొందిస్తారో చూడాలి.
పీకే మిశ్రా
ప్రమోద్ కుమార్ మిశ్రా(పీకే మిశ్రా) భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ కేడర్‌కు చెందిన ఆయన 1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2001-2004 మధ్యకాలంలో మిశ్రా నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
అరవింద్ శ్రీవాస్తవ
ప్రధానమంత్రి కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ ఎకానమీ అధికారిగా అరవింద్ శ్రీవాస్తవ పనిచేస్తున్నారు. కర్ణాటక కేడర్‌కు చెందిన ఆయన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ అతని పరిధిలోనే ఉన్నాయి. అతను జాయింట్ సెక్రటరీగా పీఎంఓలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో చేరారు.
పుణ్య సలిల శ్రీవాస్తవ
పుణ్య సలిల శ్రీవాస్తవ ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం, కేంద్రపాలిత ప్రాంతం) కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నవంబర్ 2020 నుంచి అక్టోబర్ 2021 వరకు హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఆమె పీఎంఓకు మారారు.
ఇదీ చదవండి: పన్ను మినహాయింపు పెంచనున్నారా..?
హరిరంజన్ రావు
హరిరంజన్ రావు మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పీఎంఓలో సాంకేతికత, పాలనపరమైన వ్యవహారాలు చూస్తున్నారు. రావు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. పీఎంఓలో చేరడానికి ముందు ఆయన టెలికమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment