
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన డు నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) రిజిస్ట్రీలో నంబరు నమోదు చేసుకున్నా ఇలాంటి కాల్స్ బెడద తప్పడం లేదు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 95 శాతం మంది తాము డీఎన్‌డీలో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ మోసగాళ్లు, టెలీమార్కెటర్లు మొదలైన వారి నుంచి అవాంఛిత కాల్స్, మెసేజీలు ఆగడం లేదని వెల్లడించారు. 5 శాతం మంది మాత్రమే తమకు అలాంటివి రావడం లేదని పేర్కొన్నారు. ప్రతి రోజూ సగటున మూడు లేదా అంతకు మించి స్పామ్ కాల్స్ వస్తుంటాయని 64 శాతం మంది వెల్లడించారు.
ఏం అడుగుతున్నారంటే?
ఇక స్పామ్ కాల్స్ విషయంలో ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ కాలర్ గుర్తింపును చూపించే యాప్‌ను ఉపయోగిస్తున్నామని, అలాంటి కాల్స్‌కు స్పందించడం లేదని 14 శాతం మంది వివరించారు. మరో 14 శాతం మంది తమ ఫోన్ బుక్‌లో ఉన్న నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 10 నుంచి మే 10 వరకూ 377 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 37,000 మంది పైగా పాల్గొన్నారు.
జరిమానాతో అయినా
అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి అధునాతన బ్లాక్‌చెయిన్ ఆధారిత టెక్నాలజీని ప్రవేశపెట్టినప్పటికీ, తమ దగ్గర నమోదు చేసుకోని టెలీమార్కెటర్లను కట్టడి చేయడం సవాలుగా ఉంటోందని ట్రాయ్ వర్గాలు తెలిపాయి. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలను పెంచాలంటూ టెలికం శాఖ గతేడాది ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment