ఇన్‌ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుంది. మానవ వనరుల లభ్యత, ప్రభుత్వ విధానాలు, భౌగోళిక అనుకూలత కారణంగా ఐటీ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను క్రమంగా విస్తరించుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్‌లో పాగా వేసిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ) సంస్థ తాజాగా మరో ఆఫీస్‌ని ప్రారంభించింది.
3000ల మంది ఉద్యోగులు
మాదాపూర్‌లో స్కైవ్యూ క్యాంపస్ భవనంలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాత సౌకర్యాలతో నూతన డెలివరీ సెంటర్‌ని మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కొత్త క్యాంపస్‌లో మూడు వేల మంది ఉద్యోగులు పని చేయనున్నారు. ఇక్కడి నుంచే డిజిటల్, డేటా, క్లౌడ్ సొల్యుషన్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సేవలు అందివ్వనుంది ఎల్‌టీఐ సంస్థ.
ఐఎస్‌బీతో ఒప్పందం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్‌తో ఎల్‌టీఐ ఒప్పందం చేసుకుంది. రాబోయే న్యూఎంటర్‌ప్రైజెస్‌లలో డిజిటల్ రెడీనెస్ యొక్క ప్రాముఖ్యతపై ఈ రెండు సంస్థలు కలిసి పని చేయనున్నాయి. హైదరాబాద్‌లో నూతన క్యాంపస్ ప్రారంభించినందుకు ఎల్‌టీఐని మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాల కారణంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు హైదరాబాద్‌లో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment