ఎల్‌ఐసీ నుంచి కొత్త ఫండ్‌.. | LIC Mutual Fund introduces open ended multi asset allocation fund | Sakshi

ఎల్‌ఐసీ నుంచి కొత్త ఫండ్‌..

Jan 27 2025 5:48 PM | Updated on Jan 27 2025 7:13 PM

LIC Mutual Fund introduces open ended multi asset allocation fund

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ (LIC Mutual Fund) ‘మల్టీ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్‌’ను (multi asset allocation fund) ప్రారంభించింది. ఈక్విటీ, డెట్, బంగారం సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల విలువను వృద్ధి చేసే విధంగా పథకం పనిచేస్తుంది. ఫిబ్రవరి 7 వరకు ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం చందాలకు అందుబాటులో ఉంటుంది.

అంతేకాదు ఫిబ్రవరి 18 నుంచి అమ్మకాలు, కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ పథకంలో 65 శాతం పెట్టుబడులకు నిఫ్టీ 500 టీఆర్‌ఐ, 25 శాతం పెట్టుబడులకు నిఫ్టీ కాంపోజిట్‌ డెట్‌ ఇండెక్స్, 10 శాతం పెట్టుబడులకు బంగారం మర్కెట్‌ ధరలు ప్రామాణికంగా ఉంటాయి. ఒకే పథకం ద్వారా ఒకటికి మించిన సాధనాల్లో పెట్టుబడికి ఈ పథకం వీలు కల్పిస్తుంది.

యాక్సిస్‌ నిఫ్టీ500 మొమెంటం ఫండ్‌ 
యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ తాజాగా నిఫ్టీ500 మొమెంటం 50 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 7 వరకు అందుబాటులో ఉంటుంది. మరింతగా పెరిగే ధోరణులు కనపరుస్తున్న స్టాక్స్‌ను గుర్తించి, వాటిలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్‌ లక్ష్యం. నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్‌లోని స్టాక్స్‌లో, వివిధ మార్కెట్‌ క్యాప్‌లవ్యాప్తంగా ఇది ఇన్వెస్ట్‌ చేస్తుంది.

తక్కువ వ్యయాలతో విస్తృతంగా పెట్టుబడుల డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలను కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువుగా ఉంటుందని యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ ఎండీ బి. గోపకుమార్‌ తెలిపారు. ఈ ఇండెక్స్‌ పలు సందర్భాల్లో ప్రధాన సూచీలను కూడా మించి రాబడులు అందించినట్లు సంస్థ సీఐవో ఆశీష్‌ గుప్తా పేర్కొన్నారు. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.  

బరోడా బీఎన్‌పీ పారిబా ఎనర్జీ ఆపర్చూనిటీస్‌ ఫండ్‌ 
వృద్ధికి అవకాశమున్న ఇంధన రంగ స్టాక్స్‌లో పెట్టుబడుల ప్రయోజనాలను అందించే బీఎన్‌పీ పారిబా ఎనర్జీ ఆపర్చూనిటీస్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది బరోడా బీఎన్‌పీ పారిబా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా సంస్థ. ఈ స్కీము ఫిబ్రవరి 4 వరకు అందుబాటులో ఉంటుంది. ఏ దేశమైనా సంపన్న దేశంగా ఎదగడంలో ఇంధన వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ సీఈవో సురేశ్‌ సోని తెలిపారు.

భారత్‌ కూడా సంపన్న దేశంగా ఎదుగుతున్న క్రమంలో దేశీయంగా ఇంధనానికి కూడా డిమాండ్‌ పెరుగుతుందని, దానికి సంబంధించిన స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ 500 సూచీలో దాదాపు మూడో వంతు స్టాక్స్‌ ఎనర్జీకి సంబంధించినవి ఉన్నాయని వివరించారు. ఇంధన అన్వేషణ, ఉత్పత్తి, రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల స్టాక్స్‌లో కనీసం 80 శాతం మొత్తాన్ని ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుందని సురేశ్‌ పేర్కొన్నారు. దీని పనితీరుకు నిఫ్టీ ఎనర్జీ టీఆర్‌ఐ ప్రామాణిక సూచీగా ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement