న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 14 రెట్లు పెరిగి రూ.9,544 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.683 కోట్లుగా ఉంది.
ఆదాయం రూ.1,68,881 కోట్ల నుంచి రూ.1,88,749 కోట్లకు వృద్ధి చెందింది. కొత్త పాలసీలపై వచ్చే తొలి ఏడాది ప్రీమియం ఆదాయం తగ్గింది. ఈ రూపంలో జూన్ త్రైమాసికంలో వచ్చిన ఆదాయం రూ.6,811 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం రూ.7,429 కోట్లతో పోలిస్తే సుమారు 9 శాతం క్షీణించింది.
పెట్టుబడుల రూపంలో వచ్చిన నికర ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.69,571 కోట్ల నుంచి రూ.90,309 కోట్లకు పెరిగింది. సాల్వెన్సీ రేషియో 1.88 శాతం నుంచి 1.89 శాతానికి పెరిగింది. ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. వసూలు కాని నిరర్థక ఆస్తులు 5.84 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గాయి. బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు ఫ్లాట్‌గా రూ.642 వద్ద క్లోజయింది. ఫలితాలు మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment