దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 942 పాయింట్లు క్షీణించి 78,782 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24 వేల దిగువన 23,995 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 1,492 పాయింట్లు క్షీణించి 78,233 వద్ద, నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 23,816 వద్ద కనిష్టాలు తాకాయి. ట్రేడింగ్ చివర్లో కనిష్ట స్థాయిల వద్ద పలు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. కొన్ని రియల్టీ రంగ షేర్లు 5–6 శాతం వరకూ పతనం కాగా... ప్రైవేటు రంగ బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు 3–6 శాతం నష్టపోయాయి.
అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలే
ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3% క్షీణించింది. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన సూచీలు 2.50% పడ్డాయి. టెలికమ్యూనికేషన్, విద్యుత్, కమోడిటీ షేర్లు 1.50% నష్టపోయాయి. వాస్తవానికి చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 2% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.50% నష్టపోయింది.
ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. 1% నుంచి అరశాతం నుంచి పతనమయ్యాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పావుశాతం నష్టపోయాయి. అమెరికా సూచీలు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 942 పాయింట్ల పతనంతో ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ. 5.99 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ.421 లక్షల కోట్లకు దిగివచ్చింది. రిలయన్స్ 3%, అదానీ పోర్ట్స్ 3%, సన్‌ఫార్మా 2.60%, ఎన్‌టీపీసీ 2.50%, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.45%, యాక్సిస్ బ్యాంకు 2.40 నష్టపోయాయి. అక్టోబర్ వాహన అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడంతో బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ షేర్లు 3–4% చొప్పున నష్టపోయాయి.
ఎదురీదిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు
ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు ఎదురీదింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.463)తో పోలిస్తే 7% డిస్కౌంటుతో రూ.430 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 9% క్షీణించి రూ.420 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే ట్రేడింగ్ చివర్లో రికవరీతో 2.50% లాభపడి రూ.475 వద్ద స్థిరపడింది.
ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!
నష్టాలు ఎందుకంటే..?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి సమావేశాల(6–7 తేదీల్లో) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. బీజింగ్‌లో జరుగుతున్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సందర్భంగా చైనా మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. చమురు ఉత్పత్తి పెంచాలనే నిర్ణయాన్ని ఓపెక్ వాయిదా వేసుకోవడంతో క్రూడాయిల్ ధరలు 2% పెరిగాయి. సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరిచేలా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment