న్యూఢిల్లీ: దేశీ యూనిట్‌లో దక్షిణ కొరియా దిగ్గజం లాటీ కన్ఫెక్షనరీ ఇన్వెస్ట్ చేయనున్నట్లు హ్యావ్‌మోర్ ఐస్ క్రీమ్ తాజాగా పేర్కొంది. రానున్న ఐదేళ్లలో లాటీ రూ. 450 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుందంటూ హ్యావ్‌మోర్ ఐస్ క్రీమ్ ఎండీ కోమల్ ఆనంద్ వెల్లడించారు. ఈ నిధులను ప్రధానంగా పుణేలోని ఎంఐడీసీ తాలెగావ్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటుతోపాటు, ఫరీదాబాద్ యూనిట్‌లో ఐస్ క్రీమ్ తయారీని విస్తరించేందుకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
వీటితోపాటు సరఫరా చైన్, ఆన్ గో–టు–మార్కెట్ అంశాలకూ వెచ్చించనున్నట్లు తెలియజేశారు. తాలెగావ్ ప్లాంటు 2024 నాలుగో త్రైమాసికంలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ లాటీ శ్రేణిలోని ప్రీమియం ఐస్ క్రీములను తయారు చేయ నున్నారు.
2017 డిసెంబర్‌లో హ్యావ్‌మోర్ ఐస్ క్రీమ్‌ను రూ. 1,000 కోట్లకు లాటీ కన్ఫెక్షనరీ కొనుగోలు చేసింది. అయితే దేశీయంగా అందుబాటు ధరల బ్రాండుగా హ్యావ్‌మోర్‌ను విస్తరిస్తూ వచ్చింది. తాజాగా లాటీ బ్రాండుతో ప్రీమియం శ్రేణి ఐస్ క్రీములను ప్రవేశపెట్టనుంది. 60,000 చదరపు మీటర్లలో ఏర్పాటు చేస్తున్న తాలెగావ్ ప్లాంటులో 1,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆనంద్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment