ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాఫ్ట్‌వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీలు ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఒక దశలో న్యూజెన్ సాఫ్ట్‌వేర్ 20 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ సైతం భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..
న్యూజెన్ సాఫ్ట్‌వేర్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో న్యూజెన్ సాఫ్ట్‌వేర్ నికర లాభం ఏడు రెట్లు ఎగసి రూ. 29 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం యథాతథంగా రూ. 155 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.9 శాతం నుంచి భారీగా 26.5 శాతానికి ఎగశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో న్యూజెన్ షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 251 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో దాదాపు 20 శాతం దూసుకెళ్లింది. రూ. 270 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది.
ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ నికర లాభం 9.7 శాతం పెరిగి రూ. 457 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 1.7 శాతం పుంజుకుని రూ. 2,998 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 2.8 శాతం బలపడి 22.9 శాతానికి ఎగశాయి. వాటాదారులకు షేరుకి రూ. 15 డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 3,078 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 3,139 వద్ద గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment