న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల పరిశ్రమ భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతోంది. అమ్మకాల పరంగా ఈ ఏడాది ఆల్ టైమ్ హై దిశగా పరిశ్రమ దూసుకెళుతోంది. లగ్జరీ కార్ల విక్రయాల్లో దేశంలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ , ఆడి 2023 జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో వ్యాపారం చేశాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో మెర్సిడెస్ బెంజ్ దేశవ్యాప్తంగా అత్యధికంగా 8,528 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. బీఎండబ్ల్యూ గ్రూప్ అత్యధికంగా 5,867 యూ నిట్ల అమ్మకాలను సాధించింది. ఇందులో 391 మి నీ బ్రాండ్ కార్లున్నాయి. గతేడాదితో పోలిస్తే బీఎండబ్లు్య గ్రూప్ 5 శాతం వృద్ధి సాధించింది. ఆడి నుంచి 3,474 యూనిట్ల కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లా యి. 2022 జనవరి–జూన్‌తో పోలిస్తే 97% ఎక్కువ.
సుమారు 47,000 యూనిట్లు..
దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–జూన్‌లో సుమారు 21,000 యూనిట్ల లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. తొలి అర్ధ భాగంతో పోలిస్తే జూలై–డిసెంబర్ పీరియడ్ మెరుగ్గా ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్‌బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. 2023లో భారత్‌లో సుమారు 46,000–47,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్‌లో అత్యధికంగా 2018లో సుమారు 40,000 యూనిట్ల లగ్జరీ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు. ‘లగ్జరీ విభాగం 2019లో అప్పటి ఆర్థిక పరిస్థితుల కారణంగా నష్టపోయింది. మహమ్మారి రాకతో 2020 నుంచి వృద్ధికి ఆటంకం కలిగింది. 2023 పునరుజ్జీవన సంవత్సరం. ప్రతి కంపెనీ వృద్ధి సాధిస్తోంది. ఏదో ఒక కంపెనీ మరో సంస్థ కంటే బలంగా ఎదుగుతోంది. ఇదే వాస్తవికత. ఇది కొనసాగుతూ ఉంటుంది’ అని తెలిపారు.
రికార్డులు బ్రేక్ అవుతాయి..
ఈ ఏడాది రెండవ అర్ధ భాగంలో రికార్డులు బద్దలు అవుతాయని బీఎండబ్లు్య గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ‘2023 జనవరి–జూన్ కంటే జూలై–డిసెంబర్ మెరుగ్గా ఉంటుంది. సరఫరా సాధారణ స్థితికి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటే బీఎండబ్లు్యకు 2023 రికార్డు సంవత్సరం అవుతుంది. డిమాండ్, ఉత్పత్తులు బలంగా ఉన్నాయి. ఎక్స్5 రాక కలిసి వస్తోంది. కస్టమర్ల నుంచి స్పందన బాగుంది. కొత్త మోడళ్ల రాక, ఇప్పటికే ఉన్న కార్లతోపాటు బలమైన భారత ఆర్థిక వ్యవస్థ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోంది. సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. ప్రజల ఆర్జన పెరుగుతోంది. ప్రస్తుతం కొన్ని పాశ్చాత్య దేశాల మాదిరిగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మనం ఎదుర్కోవడం లేదు. మాకు ఇక్కడ ఇది ఇప్పటికీ సహేతుక స్థాయి. భారత ఆర్థిక వ్యవస్థలో బలమైన పునాది ఉంది. ఇది వృద్ధికి అవకాశం ఇస్తుంది’ అని వివరించారు.
2030 నాటికి రెండింతలు..
స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు కూడా బలమైన వృద్ధిని నమోదు చేయడం వంటి ఇతర అంశాలు, మెరుగైన బోనస్‌లు, చెల్లింపులు ఉన్నాయి. చాలా కంపెనీలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నాయి అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ప్రస్తుతం పరిశ్రమ బలంగా ఊపందుకుంటోంది. వినియోగదార్లు లగ్జరీ కార్ల వైపు చాలా స్పృహతో మళ్లుతున్నారు. కాబట్టి డిమాండ్ కొనసాగుతోంది’ అని సంతోష్ చెప్పారు. మొత్తం కార్ల విభాగం మాత్రమే కాకుండా లగ్జరీ సెగ్మెంట్ కూడా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నామని బల్‌బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘మధ్య, దీర్ఘకాలిక వృద్ధి కథనం చెక్కుచెదరకుండా ఉంది. మొత్తం కార్ల విభాగంలో ప్రస్తుతం లగ్జరీ విభాగం వాటా కేవలం 1 శాతం మాత్రమే. 2030 నాటికి ఇది 2 శాతానికి చేరుతుంది. పరిశ్రమ సరైన దిశలో పయనిస్తోంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment