న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తొలిసారి ఒక మహిళ నాయకత్వం వహించనున్నారు. కేబినెట్ ఎంపికల కమిటీ.. మాజీ బ్యాంకర్ మాధవీ పురీ బుచ్‌ను సెబీ కొత్త చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీకాలం సోమవారం(28న) ముగియనుంది. దీంతో నేటి(మార్చి1) నుంచి 57 ఏళ్ల మాధవి బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలిగా మూడేళ్లపాటు సెబీ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. వెరసి సెబీ నిర్వహణకు ప్రైవేట్ రంగం నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవనున్నారు. సెబీకి పూర్తికాలపు తొలి మహిళా సభ్యురాలిగా కూడా మాధవి సేవలందించడం గమనార్హం!
30 ఏళ్ల అనుభవం..
ఫైనాన్షియల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల కెరీర్‌ను సొంతం చేసుకున్న మాధవీ పురీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కెరీర్‌ను ప్రారంభించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 1989లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 12 ఏళ్ల సర్వీసులో మూడేళ్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు ఎండీ, సీఈవోగా పదోన్నతి పొందారు. 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2011లో పీఈ కంపెనీ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్‌ఎల్‌పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు. తదుపరి బ్రిక్స్ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో కన్సల్టెంట్‌గా సేవలందించారు. ఇవికాకుండా అగోరా అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా.
త్యాగి ఐదేళ్లు...: 1984 బ్యాచ్ హిమాచల్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ త్యాగి 2017 మార్చి 1న సెబీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. తొలుత మూడేళ్లు బాధ్యతలు నిర్వహించాక తదుపరి ఆరు నెలలపాటు, ఆపై మరో 18 నెలలపాటు చైర్మన్ పదవీ నిర్వహణకు గడువును పొందారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్థుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి ప్రస్తుత చైర్మన్ త్యాగితో కలసి 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబర్ 4 వరకూ పలు కీలక విధులను నిర్వర్తించారు.
మాధవీ పురీ కెరీర్...
సెబీకి తొలి మహిళా సారథిగా బాధ్యతలు చేపట్టనున్న మాధవీ పురీ ఐసీఐసీఐ బ్యాంక్‌సహా ప్రైవేట్ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. 2008 నవంబర్ 26న ముంబైలోని ఓ హోటల్‌పై టెర్రిరిస్టుల దాడి జరిగినప్పుడు చిక్కుకుపోయిన కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా ఉన్నారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్‌లో ముగిసింది. దీంతో అదే ఏడాది డిసెంబర్‌లో సెబీ సెకండరీ మార్కెట్ కమిటీ అధినేత్రిగా ఎంపికయ్యారు. సెకండరీ మార్కెట్ల రక్షణ, సామర్థ్యం, పారదర్శకత తదితర అంశాల మెరుగుపై సలహా కమిటీ ద్వారా సెబీకి సేవలందించారు.
34 ఏళ్ల చరిత్రలో సంచలనం,సెబీ ఛైర్మన్‌గా మాధవి పూరి బచ్!!
Published Mon, Feb 28 2022 6:45 PM | Last Updated on Tue, Mar 1 2022 8:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment