విమాన ప్రయాణం అంటే పకడ్బందీ తనిఖీలుంటాయి. అన్ని ధ్రువపత్రాలు సరిచూసి, స్కాన్ చేసి మరీ ప్రయాణికులను విమానంలోకి పంపిస్తారు. అలాంటిది వారి కళ్లుకప్పి టికెట్ లేకుండా ఓ వ్యక్తి రహస్యంగా విమానంలోకి ప్రవేశించిన ఘటన అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం..ఇటీవల టెక్సాస్‌కు చెందిన 26 ఏళ్ల విక్లిఫ్ వైవ్స్ ఫ్లూరిజార్డ్ అనే వ్యక్తి పార్క్‌సిటీలోని ఉటాలో జరిగిన స్నోబోర్డింగ్‌ట్రిప్ కోసం వచ్చాడు. తాను వచ్చేపుడు తన స్నేహితుడి ‘బడ్డిపాస్’ ద్వారా ఉటా చేరుకున్నాడు. తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో తాను వెళ్లాలనుకున్న రెండు విమానాలు అప్పటికే ప్రయాణికులతో నిండిపోయాయి. దాంతో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన వేరే విమానంలో ప్రయాణించాలనుకున్నాడు. అయితే తాను అప్పటికీ టికెట్ తీసుకోలేదు. విమానం కోసం లాంజ్‌లో వేచిచూస్తున్న ఇతర ప్రయాణికుల వివరాలు, టికెట్ ఫొటోలు వారికి తెలియకుండా దొంగతనంగా తన ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఎలాగోలా ముందే విమానం ఎక్కేశాడు.
విమానం ఎక్కిన విక్లిఫ్ చివరి లావేటరీకి చేరుకున్నాడు. తాను ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. షెడ్యూల్ ప్రకారం విమానం బయలుదేరే సమయానికి సిబ్బంది ఇతర ప్రయాణిలను ఎక్కించారు. అప్పటి వరకు చివరి లావేటరీలో ఉన్న విక్లిఫ్ విమానం కదులుతుంటే సిబ్బంది వద్దకు చేరుకుని తన సీటు ఖాళీగా లేదన్నారు. దాంతో సిబ్బంది టికెట్ వివరాలు అడగ్గా తన సీటు నంబర్ 21 ఎఫ్ అని అటెండర్‌కి చెప్పాడు. అయితే ఆ సీటు కోసం టికెట్ కొన్న వ్యక్తి అప్పటికే అక్కడ కూర్చున్నాడని సిబ్బంది ధ్రువీకరించారు.
ఇదీ చదవండి: వర్షం కురిస్తే ట్యాక్స్ కట్టాల్సిందే..!
విమానం అప్పటికే రన్‌వేపైకి చేరుకుంది. వెంటనే సిబ్బంది గ్రౌండ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాను రహస్యంగా విమానంలో ప్రవేశించినట్లు తేలడంతో తనను ఫ్లైట్ నుంచి దింపేసి పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు తాను ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుని ఈ చర్యకు పాల్పడ్డాడని చెప్పారు. కేసు నమోదు చేసి ఉటా కోర్టుకు పంపించారు. ఎయిర్‌పోర్ట్‌లో తాను రహస్యంగా ఇతర ప్రయాణికుల నుంచి దొంగతనంగా ఫొటోలు తీసుకోవడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వివరాలను పోలీసులు కోర్టులో సమర్పించినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి విచారణ జరిపి పోలీసులు విక్లిఫ్‌ను సాల్ట్ లేక్ కౌంటీ మెట్రో జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment