ముంబై: వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తద్వారా రెండో రోజూ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ట్రిపుల్ సెంచరీతో ప్రారంభంకావడం ద్వారా సెన్సెక్స్, 80 పాయింట్ల లాభంతో మొదలైన నిఫ్టీ తాజాగా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 42,959ను తాకింది. తద్వారా 43,000 పాయింట్ల మైలురాయిపై కన్నేసింది. ఇక నిఫ్టీ తొలిసారి 12,500ను అధిగమించి 12,557కు చేరింది. సోమవారం సైతం మార్కెట్లు లైఫ్ టైమ్ హైలను సాధించిన విషయం విదితమే. భూగోళాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 మహమ్మారికి చెక్ పెట్టగల వ్యాక్సిన్ 90 శాతంపైగా విజయవంతమైనట్లు ఫైజర్ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 42,714కు చేరగా.. నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 12,486 వద్ద ట్రేడవుతోంది.
బ్యాంక్స్ జోరు
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్ 1.6 శాతం, రియల్టీ 0.7 శాతం చొప్పున పుంజుకోగా.. ఐటీ 3 శాతం, ఫార్మా 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, ఎల్అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గెయిల్, ఎస్ బీఐ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, ఐవోసీ, శ్రీసిమెంట్, యాక్సిస్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, సిప్లా, దివీస్, నెస్లే, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ 4-0.6 శాతం మధ్య క్షీణించాయి.
పీవీఆర్ జూమ్
డెరివేటివ్స్‌లో పీవీఆర్, యూబీఎల్, ఇండిగో, మెక్డోవెల్, భారత్ ఫోర్జ్, టాటా పవర్, అశోక్ లేలాండ్, బాష్ 6-1.6 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. ముత్తూట్, జూబిలెంట్ ఫుడ్, మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్స్, కోఫోర్జ్, మణప్పురం 6-2.3 శాతం మధ్య నష్టపోయాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్ 0.2 శాతం నీరసించగా, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 841 లాభపడగా.. 881 నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment