న్యూఢిల్లీ: సముద్రాల్లో వందల కొద్దీ మీటర్ల లోతున ఉండే సహజ వాయువు నిక్షేపాలను కనుగొని, వెలికి తీయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ వీపీ సంజయ్ రాయ్ తెలిపారు. ఈ రంగంలోకి పెట్టుబడులు రావాలంటే ధర, మార్కెటింగ్‌పరమైన స్వేచ్ఛ కల్పించడం కీలకమని పేర్కొన్నారు. చమురు, గ్యాస్ ఆపరేటర్ల సమాఖ్య ఏవోజీవో ఈ విషయాన్నే గ్యాస్ ధరను సమీక్షిస్తున్న ప్రభుత్వ నియమిత కిరీట్ పారిఖ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్ కాల్‌లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు వివరించారు.
అటు వినియోగ సంస్థలు మాత్రం గ్యాస్ ధరపై ఎంతో కొంత పరిమితి ఉండాలని కోరుకుంటున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పారిఖ్ కమిటీ రాబోయే కొన్ని వారాల్లో నివేదికను సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రైమరీ ఎనర్జీ బాస్కెట్‌లో 6.7 శాతంగా ఉన్న దేశీ గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే కనీసం రూ. 2–3 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని కమిటీకి ఏవోజీవో తెలిపింది. విద్యుత్తు, ఎరువులు మొదలైన వాటి ఉత్పత్తిలో సహజ వాయువును వినియోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment