మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7, 8 రెండు రోజుల పర్యటనలో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు, ఈ టెక్నాలజీ వినియోగంతో వచ్చే అవకాశాల గురించి మాట్లాడనున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ నిపుణులు ఈ రెండు రోజుల పర్యటనలో సత్యనాదెళ్ల ఏఐ గురించి ఏం మాట్లాడుతారా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే వెలుగులోకి వచ్చిన మైక్రోసాఫ్ట్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చాందక్ ఇంటర్నల్ మెయిల్స్ ఆధారంగా ‘మైక్రోసాఫ్ట్ భారత్‌లో ఆయా టెక్నాలజీల వినియోగం, అవకాశాల్ని మరింత విస్తరించనుందని’ తెలుస్తోంది.
సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ
2023లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెక్ దిగ్గజ కంపెనీలైన యాపిల్ సీఈఓ టిమ్‌కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోస్టాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు.
ఆ భేటీలో భారత్ టెక్నాలజీ వినియోగం, అవకాశాల గురించి సీఈఓలతో మోదీ మాట్లాడారు. ఆ చర్చలకు కొనసాగింపుగా.. భారత్‌లో పర్యటించనున్న సత్యనాదెళ్ల ప్రధాని మోదీతో భేటీ అవుతారంటూ మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో తెలిపింది. వీరిరువురి భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారతదేశ సామర్థ్యాల గురించి చర్చకు వస్తాయని పేర్కొంది.
టెక్నాలజీలో భారత్ భళా
‘భారతీయుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడే టెక్నాలజీలలో కృత్రిమ మేధస్సు ఒకటి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన డెవలపర్, స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థలకు నిలయం. మైక్రోసాఫ్ట్ భారతీయ సాంకేతికత వృద్ధికి కట్టుబడి ఉంది. ఇది భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లను ప్రభావితం చేస్తుంది’ మైక్రోసాఫ్ట్ ప్రకటనలో హైలెట్ చేసింది.
ఏడాది క్రితం భారత్‌లో పర్యటన
ఏడాది క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెళ్ల భారత్‌లో నాలుగు రోజుల అధికారిక పర్యటన చేశారు. తన పర్యటనలో కస్టమర్లు, స్టార్టప్‌లు, డెవలపర్‌లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులను కలిశారు.
భవిష్ అగర్వాల్ సైతం
పలు నివేదికల ప్రకారం.. భారత్ పర్యటకు రానున్న సత్యనాదెళ్లతో ముంబై, బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్స్ ఫౌండర్లు ఆయనతో భేటీ కానున్నారు. వారిలో సర్వం ఏఐ సంస్థ అధినేతలు, ఏఐ స్టార్టప్ కృత్తిమ్ ఫౌండర్ భవిష్ అగర్వాల్‌లు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment