ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా.. ఇలా ఎంతో మంది భారతీయ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎదిగినా బిడ్డకు తల్లే ఆది గురువు అని అంటారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మదర్స్ డే సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి మాతృమూర్తుల గురించి తెలుసుకోండి..
ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా?
కోకిలాబెన్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి, దివంగత ధీరూబాయి అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుక చోదక శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె మధ్యతరగతి గుజరాతీ పాటిదార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి, రతీలాల్ జష్రాజ్ పటేల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉద్యోగి. తల్లి రుక్ష్మాణిబెన్ గృహిణి. 1955లో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని బలమైన పేర్లలో ఆమె ఒకరు. 2009లో ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిని స్థాపించారు.
శాంతాబెన్ అదానీ
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తల్లి పేరు శాంతాబెన్ అదానీ. 2010లో మరణించిన ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తర గుజరాత్‌లోని థారాడ్ నుంచి భర్త శాంతిలాల్ అదానీతో కలిసి అహ్మదాబాద్‌కు వలస వచ్చి మొదట్లో వాల్ సిటీలోని రతన్‌పోల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె తన జీవితకాలంలో పలు దానధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు.
రాజశ్రీ బిర్లా
ఆదిత్య బిర్లా సంస్థల అధిపతి కుమారమంగళం బిర్లా మాతృమూర్తి రాజశ్రీ బిర్లా. దివంగత ఆదిత్య బిర్లా సతీమణి. బిర్లా కుటుంబంలో చెప్పుకోదగిన పేరు ఆమెది. పరోపకారి అయిన రాజశ్రీ బిర్లా 1995లో భర్త మరణించిన తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ నిధులతో దాతృత్వ సంస్థను కూడా అభివృద్ధి చేశారు. దీంతో ఆమెను భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో సత్కరించింది.
సూని టాటా
దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తల్లీ పేరు సూని టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్‌జీ టాటా మేనకోడలైన ఆమె అసలు పేరు సూని కమిషారియట్. రతన్ టాటా తన తల్లితో ఎక్కువ సమయం గడపలేదు. తన పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత రతన్ టాటాను అతని బామ్మ నవాజ్‌బాయి టాటా చేరదీసి పెంచారు.
ఇందిరా మహీంద్రా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తన తల్లి ఇందిరా మహీంద్రా గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంటుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించిన ఇందిరా లక్నోలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. రచయిత్రి అయిన ఆమె తన పేరుతో నాలుగు పుస్తకాలు రాశారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాకు కూడా పనిచేశారు. ఆనంద్ మహీంద్రా ఏటా తన తల్లి జ్ఞాపకార్థం లక్నోలో ఓ సాంస్కృతిక ఉత్సవాన్ని జరిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment