న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి ఉపాధి అవకాశాల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం ముందున్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. 2023 మార్చి నెలకు సంబంధించి నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (బ్యాంకింగ్) ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 4,555కి చేరుకుందని, 2022 మార్చి నెలలో ఉన్న 3188తో పోలిస్తే 45 శాతం మేర వృద్ధి చెందినట్టు పేర్కొంది. నాన్ మెట్రో పట్టణాలు ఉపాధి అవకాశాల వృద్ధికి తోడ్పడినట్టు వివరించింది.
బీఎఫ్‌ఎస్‌ఐ మినహా దేశంలో నియామకాల ధోరణి అప్రమత్తతో కూడిన ఆశావహంగా ఉందని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ తెలిపింది. నూతన ఉద్యోగ నియామకాల డేటా ఆధారంగా ప్రతి నెలా ఈ నివేదికను నౌకరీ సంస్థ విడుదల చేస్తుంటుంది. మార్చి నెలకు సంబంధించి ఈ సూచీ 2979గా ఉంది. 2022 మార్చి నెలతో పోలిస్తే 5 శాతం పెరగ్గా.. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఫ్లాట్‌గా ఉంది.
నాన్ టెక్నాలజీ రంగాలు
నూతన ఉపాధి కల్పన పరంగా బీమా, బ్యాంకింగ్ రంగాలు సంప్రదాయ బుల్ ర్యాలీలో ఉన్నట్టు, మొత్తం మీద కార్యాలయ ఉద్యోగాల మార్కెట్‌లో గణనీయమైన నియామకాలకు తోడ్పడుతున్నట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. బీమా రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 108 శాతం వృద్ధి (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) చెందాయి. ప్రధానంగా బీమా పాలసీలను విక్రయించే విభాగంగా కొత్త ఉద్యోగాలు లభించాయి.
డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు డిమాండ్ పెరగడంతో బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 45 శాతం ఎక్కువగా వచ్చాయి. పట్టణాల వారీగా బ్యాంకింగ్ ఉపాధి అవకాశాల్లో వైవిధ్యం కనిపించింది. అహ్మదాబాద్ పట్టణంలో 149 శాతం వృద్ధి కనిపిస్తే, వదోదరలో 72 శాతం, కోల్‌కతాలో 49 శాతం కొత్త ఉపాధి అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో వచ్చాయి. బహుళజాతి బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, బీమా ఉత్పత్తులపై దృష్టి సారించిన దేశీ ఆర్థిక దిగ్గజాల నుంచి ఈ ఉపాధి అవకాశాలు వచ్చినట్టు ఈ నివేదిక వివరించింది.
ఐటీ రంగంలో క్షీణత
ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 17 శాతం తగ్గాయి. మెషిన్‌లెర్నింగ్ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఆయిల్ రంగంలో 36 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 31 శాతం, ఎఫ్‌ఎంసీజీలో 14 శాతం, హాస్పిటాలిటీ రంగంలో 7 శాతం మేర నూతన ఉద్యోగాలు మార్చి నెలలో (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు) అందుబాటులోకి వచ్చాయి. రిటైల్, విద్య, బీపీవో రంగాల్లో 4–2 శాతం మేర నియామకాలు తగ్గాయి.
హైదరాబాద్‌లో స్వల్పంగా క్షీణత
మెట్రో పట్టణాల పరంగా చూస్తే ముంబైలో మార్చి నెలలో 17 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగ్గా, ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో 7 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో 12 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 11 శాతం, పుణెలో 2% చొప్పున నియామకాలు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment