ముంబై : లాక్‌డౌన్ సడలింపులు, కీలక పరిశ్రమలు తెరుచుకోవడంతో భారత్‌లో నియామకాల ప్రక్రియ ఊపందుకుందని నౌకరీ జాబ్‌స్సీక్ పేర్కొంది. జులైలో దేశవ్యాప్తంగా హైరింగ్ ప్రక్రియ అంతకుముందు నెలతో పోలిస్తే 5 శాతం పెరిగిందని వెల్లడైంది. జులైలో నియామకాలు అధికంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో 36 శాతం, హెచ్‌ఆర్‌లో 37 శాతం, నిర్మాణ ఇంజనీరింగ్ రంగాల్లో 27 శాతంగా ఉన్నాయని తెలిపింది. బీఎఫ్‌ఎస్‌ఐ పరిశ్రమలో 16 శాతం, ఆటోమొబైల్స్‌లో 14 శాతం, టెలికాం పరిశ్రమలో 13 శాతం మేర హైరింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదైంది. ఐటీ హార్డ్‌వేర్ రంగంలో 9 శాతం మేర హైరింగ్ ప్రక‍్రియ జరగ్గా, ఐటీ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి హైరింగ్ జోరూ కనిపించలేదని నౌకరీ జాబ్‌స్పీక్ పేర్కొంది. అయితే విద్యా బోధనా రంగంలో -22 శాతం, ఆతిథ్య రంగంలో -5 శాతం, రిటైల్‌లో -2 శాతం మేర హైరింగ్ ప్రక్రియలో క్షీణత నమోదైంది.
ఇక మెట్రో నగరాల విషయానికి వస్తే ఢిల్లీలో అత్యధికంగా హైరింగ్ ప్రక్రియ 10 శాతం వృద్ధి చెందగా తర్వాతి స్ధానాల్లో వరుసగా ముంబై (8శాతం), చెన్నై(4 శాతం) నిలిచాయి. బెంగళూర్, కోల్‌కతాలో నియామకాలు 4 శాతం తగ్గడం గమనార్హం. ఇక మెట్రోలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి నగరాలు జైపూర్, వదోదర, చండీగఢ్‌లో భారీగా నియామకాలు వృద్ధి చెందాయి. జైపూర్‌లో హైరింగ్ ప్రక్రియ 40 శాతం పెరగ్గా, వదోదరాలో నియామకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. జులైలో అంతకుముందు నెలలతో పోలిస్తే నియామకాల ప్రక్రియ ఊపందుకుందని రిక్రూట్‌మెంట్, మీడియా, వినోద రంగం, నిర్మాణ రంగాల్లో సాధారణ పరిస్ధితి తిరిగి నెలకొంటోందని నౌక్రీ.కాం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ పేర్కొన్నారు. తయారీ, నిర్వహణ, ఫార్మా, మీడియా, మార్కెటింగ్, ప్రకటనలు, సేల్స్ రంగాల్లో నియామకాలు ఊపందుకోగా, ఆతిథ్య, బోధన రంగాల్లో నియామకాలు ఇంకా పుంజుకోలేదని వివరించారు. చదవండి : ఊరట : జనవరి నుంచి కొలువుల సందడి
Comments
Please login to add a commentAdd a comment