సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో పలు రంగాల్లో నియామకాలు భారీగా పడిపోయినా ఐటీ, వైద్య సేవలు, మార్కెటింగ్ రంగాల్లో హైరింగ్ ఊపందుకుంది. డెలివరీ, ఐటీ మేనేజర్ల నియామకాలు కూడా ప్రోత్సాహకరంగా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేయడం, నియామకాలను నిలిపివేస్తున్న పరిస్థితుల్లోనూ భారత్‌లో హైరింగ్ ప్రక్రియ పెద్దగా దెబ్బతినలేదని ఓ నివేదిక వెల్లడించింది. మార్చి రెండో వారం వరకూ నియామకాలు గత ఏడాది తరహాలోనే సాగాయని, మార్చి ద్వితీయార్ధం నుంచి ఏప్రిల్, మే వరకూ లాక్‌డౌన్‌ల ప్రభావంతో మందగించాయని అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక తెలిపింది.
జూన్‌లో ఇండీడ్ జాబ్ పోస్టింగ్స్ గత ఏడాదితో పోలిస్తే 51 శాతం తగ్గాయని, బ్రిటన్‌లో 60 శాతం, మెక్సికో, ఇతర యూరప్ దేశాల్లో 61 శాతం మేర తగ్గాయని నివేదిక పేర్కొంది. అయితే అమెరికాలో మాత్రం జాబ్ పోస్టింగ్స్ కేవలం 29 శాతం, సింగపూర్‌లో 32 శాతం, ఆస్ర్టేలియాలో 42 శాతం మేర తగ్గాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్-19 ప్రభావం ప్రారంభమైన ఫిబ్రవరి నుంచి మే వరకూ ఇండీడ్ వేదికపై అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. కోవిడ్-19 ప్రభావంతో అత్యధికంగా చైల్డ్‌కేర్, ఆహార తయారీ రంగాల్లో 78 శాతం మేర జాబ్ పోస్టింగ్స్ తగ్గాయని, టూరిజం, ఆతిథ్య రంగాల్లో 77 శాతం, శానిటేషన్‌లో 74 శాతం చొప్పున జాబ్ లిస్టింగ్స్ తగ్గాయని నివేదిక తెలిపింది. చదవండి : ‘మహమ్మారిని ఆ దేవుడే పంపాడు’
Comments
Please login to add a commentAdd a comment