దిగ్గజ పారిశ్రామికవేత్త, రేమండ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విడాకుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సరిగ్గా నెల రోజుల క్రితం గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ సింఘానియాల 32 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి తాము వేర్వేరు దారుల్లో ప్రయణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన తర్వాత ఇచ్చిన వరుస ఇంటర్వ్యూల్లో గౌతమ్ సింఘానియా నుంచి ఎదురైన వేధింపులు, జరిపిన దాడుల గురించి సంచలన విషయాల్ని బయట పెడ్తూ వచ్చారు.
విడాకులు వ్యవహారం సాఫీగా జరిగేలా గౌతమ్ సింఘానియాకు చెందిన రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటాను కుమార్తెలు నిహారిక, నిషాతో పాటు తన కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని సైతం నవాజ్ మోదీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో’
దీనిపై స్పందించిన గౌతమ్ సింఘానియా ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో’ అని అన్నారన్న విషయాన్ని లేవనెత్తారు. ఈ వ్యవహారం ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడంతో పాటు ఇన్వెస్టర్లలలో కంపెనీపై నమ్మకం సన్నగిల్లింది.
ఈ తరుణంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్‌లోని ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు సలహాలు ఇచ్చే ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఎల్‌ఐఏఎస్ రంగంలోకి దిగింది. సీఎండీ గౌతమ్ సింఘానియాపై వచ్చిన దాడి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాలని రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లను కోరింది.
గౌతమ్ సింఘానియా ఒప్పుకున్నారా?
ఈ వరుస పరిణామాల నేపథ్యంలో విడుదల గౌతమ్ సింఘానియా - నవాజ్ మోదీ సింఘానియాల విడుకులపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గౌతమ్ సింఘానియా నుంచి నవాజ్ మోదీ సింఘానియా ఆశిస్తున్న 75 శాతం కాకుండా.. చట్టపరంగా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేందుకు గౌతమ్ ఒప్పుకున్నారని, ఆమొత్తాన్ని తీసుకునేందుకు నవాజ్ మోదీ అంగీకరించారని నివేదికలు హైలెట్ చేశాయి. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని చెప్పాయి.
బెర్జిస్ దేశాయ్ నియామకం
దీనిపై రేమాండ్ బోర్డు స్పందించింది. గౌతమ్ సింఘానియా, అతని భార్య నవాజ్ మోదీ సింఘానికి మధ్య కొనసాగుతున్న వివాదానికి సంబంధించి బోర్డుకు సలహా ఇవ్వడానికి సీనియర్ స్వతంత్ర న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ను నియమించినట్లు తెలిపింది. ఈ విషయం తమ పరిధికి వెలుపల ఉందని బోర్డు స్పష్టం చేసింది. అయితే పరిణామాలను పర్యవేక్షించడంలో, బోర్డుకి సమాచారం ఇవ్వడంలో దేశాయ్ పాత్ర ఉందని రేమాండ్ బోర్డు అంగీకరించింది.
లాభాల్లో రేమాండ్ షేర్లు
కాగా రేమాండ్ యాజమాన్యం వ్యక్తిగత వివాదం కారణంగా ఆ కంపెనీ స్టాక్స్ క్షీణిస్తూ వచ్చాయి. అయితే గత వారం చివరి ట్రేడింగ్ రోజున కంపెనీ షేర్లు 4 శాతానికి పైగా పెరిగి రూ.1,563 వద్ద ముగిసింది. తాజా నివేదికలతో ఈరోజు స్టాక్ మార్కెట్‌లో రేమాండ్ షేర్లు 1.4శాతం పెరిగాయి. ఒక్కో షేర్ విలువ రూ.1,578.80కి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment