ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఈసురోమంటూ ఇల్లు చేరడం. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవు రోజుల కోసం నిరీక్షించడం. ఇదంతా ఒకప్పటి మాట. కోవిడ్-19తో పరిస్థితులు మారాయ్. ఉద్యోగులు ఆఫీస్‌కు బదులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే కరోనా అదుపులోకి రావడంతో సంస్థలు ఉద్యోగుల్ని ఆఫీస్‌కు రప్పిస్తున్నాయి. ఇంటి వద్ద నుంచి పనిచేసే విధానాన్ని రద్దు చేస్తున్నాయి. ఈ తరణంలో ఓ దేశ ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను చట్టబద్దం చేయనుంది
నెదర్లాండ్ ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విషయంలో ప్రత్యేక హక్కును కల్పించింది. నచ్చితే ఆఫీస్‌కు రావొచ్చు. లేదంటే ఇంట్లో ఉండి ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. ఈ బిల్లుకు నెద్దర్లాండ్ పార్లమెంట్ దిగువ సభ మద్దతు పలికింది. సెనేట్ సైతం ఈ వర్కింగ్ యాక్ట్‌కు ఆమోదం తెలిపితే దేశంలో వర్క్ ఫ్రం హోం చట్టం అమలు కానుంది.
ఈ సందర్భంగా నెదర్లాండ్ గ్రోన్‌లింక్స్ పార్టీకి చెందిన 'సెన్నా మాటౌగ్' మాట్లాడుతూ..ఉద్యోగులు ఇంట్లో ఉండి ఓ వైపు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కుటుంబ సభ్యులతో గడపవచ్చు. ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడం చట్టబద్ధమైన హక్కుగా మార్చేలా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ యాక్ట్ -2015ని సవరణలు చేస్తామని అన్నారు. ఈ చట్టంతో ఉద్యోగులు తమ పని గంటలు, పని ప్రదేశాల్ని మార్చుకునేందుకు సౌలభ్యం కానుందన్నారు.
ఈ కొత్త చట్టం అమలు కోసం నెదర్లాండ్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా..అదే సమయంలో నెదర్లాండ్‌లో కరోనా తగ్గడంతో ఆయా సంస్థలు ఉద్యోగుల్ని ఆఫీస్‌కు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అందుకు ఉద్యోగులు ఒప్పుకోవడం లేదు. ఇంటి వద్ద నుంచి పనిచేస్తామని పట్టుబడుతున్నారు.ఈ తరుణంలో ఈ కొత్త చట్టం అమలు ఉద్యోగులకు వరంగా మారనుంది. వర్క్ ఫ్రం హోం చేస్తామంటే ఒప్పుకోని సంస్థలు ఉద్యోగుల మాట వినాల్సిందే. కొత్త యాక్ట్‌లో ఉన్నట్లుగా ఉద్యోగులు తాము వర్క్ ఫ్రం హోం ఎందుకు చేయాలనుకుంటున్నారో బలమైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. వారికి నచ్చినట్లుగా పనిచేసుకోవచ్చు.సంస్థలు సైతం అందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది.
కాగా, ఇప్పటికే దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను రద్దు చేసి ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మరి నెదర్లాండ్ ప్రభుత్వం అందుకు విభిన్నంగా కొత్త చట్టంపై పనిచేయడంతో ఇతర దేశాలకు చెందిన సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: 'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్‌ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్!
Comments
Please login to add a commentAdd a comment