న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ కొత్త ఇష్యూ ఈ నెల 11న (సోమవారం) ప్రారంభం కానుంది. 15వ తేదీ వరకూ అందుబాటులో ఉండే ఈ స్కీమ్ ఇష్యూ ధర గ్రాముకు రూ.5,923. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది రెండవ విడత బాండ్ల జారీ.
జూన్ 19న వెలువడిన మొదటి విడత బాండ్ జారీలో ధర గ్రాముకు రూ.5,926. గోల్డ్ బాండ్లు– షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీ–మ్యాట్ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్‌లు జారీ చేస్తారు. 2015 నవంబర్‌లో ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్‌లు.. భౌతిక బంగారం డిమాండ్‌ను తగ్గించడం, బంగారం కొనుగోళ్ల నుంచి దేశీయ పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపులకు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. మెచ్యూరిటీపై బాండ్లను నగదు రూపంలో రీడీమ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment