ముంబై: పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, వృద్ధికి ఊతమిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఉదార విధానాల సంకేతాలివ్వడంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ ఏకంగా 362 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ మళ్లీ 11,200 పాయింట్లకు చేరింది. గురువారం ఇంట్రాడేలో 558 పాయింట్లు ర్యాలీ చేసిన సెన్సెక్స్ చివరికి 0.96 శాతం లాభంతో 38,025 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 11,200.15 వద్ద ముగిసింది. ‘దేశీ సూచీలు గరిష్ట స్థాయిల నుంచి తగ్గినప్పటికీ లాభాల్లోనే ముగిశాయి.
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ప్రకటించిన నిర్ణయాలు ఇందుకు కారణం. రేట్ల కోతపై అంచనాలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ మాత్రం రేట్లను యథాతథంగానే ఉంచింది. అయితే, వృద్ధి మెరుగుపడే దాకా ఉదార విధానాలు పాటించనున్నట్లు ద్రవ్యపరపతి విధాన సమీక్షలో సూచనప్రాయంగా వెల్లడించింది. ఒకవేళ ద్రవ్యోల్బణం గానీ అదుపులోకి వస్తే రిజర్వ్ బ్యాంక్ పరపతి విధానాన్ని మరికాస్త సడలించే అవకాశం ఉంది. ఆర్‌బీఐకి సంబంధించిన కీలక ఘట్టం పూర్తయిపోవడంతో ఇక మార్కెట్ వర్గాలు మళ్లీ కంపెనీల ఆదాయ అంచనాలు తదితర అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
మిశ్రమంగా రియల్టీ, ఆటో సూచీలు..
వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంక్, రియల్టీ, ఆటోమొబైల్ స్టాక్స్ మిశ్రమంగా స్పందించాయి. బంధన్ బ్యాంక్ షేరు 3.57 శాతం, ఆర్‌బీఎల్ బ్యాంక్ 0.49 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.43 శాతం, ఎస్‌బీఐ 0.29 శాతం నష్టాల్లో ముగిశాయి. అయితే, సిటీ యూనియన్ బ్యాంక్ 2.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.97 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.24 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.44 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.39 శాతం, ఫెడరల్ బ్యాంక్ 0.19 శాతం పెరిగాయి. అటు ఆటోమొబైల్ స్టాక్స్‌లో టీవీఎస్ మోటార్ 2.22 శాతం, టాటా మోటార్స్ 1.13 శాతం, మారుతీ సుజుకీ ఇండియా 0.49 శాతం, హీరో మోటోకార్ప్ 0.26 శాతం, అశోక్ లేల్యాండ్ 0.10 శాతం పెరిగాయి. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా 0.75 శాతం, బజాజ్ ఆటో 0.67 శాతం, ఎంఆర్‌ఎఫ్ 0.42 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ ఆటో సూచీ 0.07 శాతం లాభపడింది.
రియల్టీ సూచీ విషయానికొస్తే.. గోద్రెజ్ ప్రాపర్టీస్ 1.48 శాతం, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 1.35 శాతం, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ 0.31 శాతం క్షీణించాయి. రియల్టీ సూచీ 1.15 శాతం పెరిగింది. మరోవైపు, సెన్సెక్స్‌లో టాటా స్టీల్ అత్యధికంగా 3.82 శాతం మేర పెరిగింది. ఇన్ఫీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా తదితర షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ ఐటీ, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్ సూచీలు పెరిగాయి. టెలికం, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ రంగ షేర్ల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ సూచీలు 0.99 శాతం దాకా పెరిగాయి. అటు ఫారెక్స్ మార్కెట్ విషయానికొస్తే అమెరికా డాలర్‌తో పోలిస్తే గురువారం రూపాయి మారకం విలువ దాదాపు గత ముగింపు స్థాయిలోనే 74.94 వద్ద క్లోజయ్యింది.
గ్లోబల్ మార్కెట్లు..
అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఖరారు కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు కనిపించాయి. హాంకాంగ్, టోక్యో సూచీలు నష్టపోగా, షాంఘై, సియోల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ప్రారంభ సెషన్లో యూరప్ స్టాక్ ఎక్సే్ఛంజీలు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment