
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్ వంటి రకరకాల పెట్టుబడి సాధనాలలో ప్రాపర్టీనే అత్యంత సురక్షితమైన, అధిక రాబడి మార్గంగా ఎదిగింది. గతేడాది ఇన్వెస్ట్‌మెంట్స్ ఎంపికలలో తొలిస్థానంలో స్థిరాస్తి రంగం నిలవగా.. సెకండ్, థర్డ్ ప్లేస్‌లలో స్టాక్స్, గోల్డ్‌లు నిలిచాయి. అత్యంత క్షీణ స్థితిలో బిట్‌కాయిన్ నిలిచింది. 76 శాతం మంది భారతీయులు రియల్టీనే ఉత్తమ పెట్టుబడి సాధనమనే ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారని నోబ్రోకర్ రియల్ ఎస్టేట్ రిపోర్ట్ తెలిపింది.
ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్ నగరాలలో 21 వేల మంది కస్టమర్లతో పాటూ, నోబ్రోకర్.కామ్‌లోని 16 మిలియన్ మంది వినియోగదారుల డేటాను విశ్లేషించి నివేదికను రూపొందించింది. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ పని విధానం కొనసాగుతుండటం, డెవలపర్ల ఆఫర్లు, తక్కువ వడ్డీ రేట్ల కారణంగా సొంతంగా ఉండేందుకు ఇళ్లు కొనాలని భావించే వారి సంఖ్య పెరిగిందని వివరించింది.
43 శాతం మంది వినియోగదారులు ఈ ఏడాది పెట్టుబడి రీత్యా రెండో ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపింది. 84 శాతం మంది కస్టమర్లు సొంతింటి కొనుగోలు కోసం ఇదే సరైన సమయమని భావిస్తున్నారని పేర్కొంది. 80 శాతం మంది పని ప్రదేశాలకు దగ్గర ఇళ్లు ఉండాలని భావిస్తున్నారు. 78 శాతం మంది ప్రధాన నగరంలో కేంద్రీకృతమై ఉండాలనుకుంటున్నారు. నిర్మాణాలు ఆలస్యం అవుతుండటం, నిధుల మళ్లింపు నేపథ్యంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు 78 శాతం కస్టమర్లు భావిస్తున్నారు.
ఎక్కువ విస్తీర్ణ గృహాలకే..
పాక్షిక లాక్‌డౌన్, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణాలు తగ్గాయి. దీంతో ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయి. వెకేషన్, లైఫ్ స్టయిల్ కోసం వ్యయం చేస్తుండేవారు. ఈ సొమ్ముతో కొంత ఎక్కువ విస్తీర్ణం ఉండే గృహాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రాపర్టీలను కొనాలని 15 శాతం మంది శోధిస్తున్నారని రిపోర్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 4 శాతం, 2019తో పోలిస్తే 8 శాతం అధికం. అంతక్రితం సంవత్సరం 29 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే కొనుగోళ్లు.. గతేడాది 33 శాతం వృద్ధి రేటు నమోదయింది. 37 శాతం మంది రెండు పడక గదులకు ఆసక్తి కనబరుస్తున్నారు.
పెరిగిన ఆన్‌లైన్ వినియోగం..
ఇంటి కొనుగోళ్లలో 73 శాతం, అద్దె గృహాలకు 55 శాతం మంది వాస్తును ఫాలో అవుతున్నారు. కరోనా తర్వాతి నుంచి ప్రాపర్టీ విజిట్స్, ఎంపిక, లావాదేవీలలో ఆన్‌లైన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రాపర్టీ కొనుగోళ్ల కంటే అద్దెల కోసం వీడియో వాక్‌త్రూల వినియోగం పెరిగింది. గది లోపలి పరిమాణం, లే–అవుట్ విస్తీర్ణాలు, ఓవర్ వ్యూల వంటివి అద్దెదారులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయని నోబ్రోకర్.కామ్ కో–ఫౌండర్ సౌరభ్ గార్గ్ తెలిపారు.
గతేడాది 77 శాతం మంది వీడియో వాక్‌త్రూ ప్రాపర్టీలను వీక్షించారని, దీంతో ఈ విభాగంలో గణనీయమైన వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో 53 శాతం మంది భూ యజమానులు అద్దెలను తగ్గింపు లేదా మాఫీ చేశారు. ఢిల్లీ, పుణే నగరాలలో గరిష్టంగా 58 శాతం అద్దెలను తగ్గించారని తెలిపారు. దీపావళి తర్వాతి నుంచి 46 శాతం మంది అద్దెలను పెంచారని తెలిపారు.
నగరంలో రూ.264 కోట్ల బ్రోకరేజ్ ఆదా..
సాధారణంగా ఎవరైనా మనకు ప్రాపర్టీ లావాదేవీలో మధ్యవర్తిత్వం వహిస్తే బ్రోకరేజ్ చార్జీ చెల్లిస్తుంటాం. నోబ్రోకరేజ్ కంపెనీ ఎలాంటి చార్జీ లేకుండా ఉచితంగా సేవలందిస్తుంది. దీంతో గతేడాది దేశవ్యాప్తంగా రూ.2,874 కోట్ల బ్రోకరేజ్ వ్యయం ఆదా అయిందని కంపెనీ తెలిపింది. నగరాల వారీగా చూస్తే.. బెంగళూరులో రూ.787 కోట్లు, ముంబైలో రూ.653 కోట్లు, చెన్నైలో రూ.497 కోట్లు, పుణేలో రూ.424 కోట్లు, హైదరాబాద్‌లో రూ.264 కోట్లు, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో రూ.250 కోట్ల బ్రోకరేజ్‌ను ఆదా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment