
ఇటీవల కాలంలో టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా విమాన ప్రయాణాల్లో జరుగుతున్న వరుస ఘటనలు ఆ సంస్థ కీర్తి ప్రతిష్టల్ని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా, జులై 9న సిడ్నీ నుండి ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి ఎయిరిండియా సిబ్బందిపై దాడి చేశాడు. ఆపై దుర్భాషలాడినట్లు తెలుస్తోంది.
సిడ్నీ నుంచి ఓ ఎయిరిండియా విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే, ఆకాశంలో ఉండగా విమానంలోని ఓ ప్రయాణికుడు ఎకానమీ క్లాసులో తాను కూర్చున్న సీటు సరిగ్గా లేదని, బిజినెస్ క్లాస్‌లో సీటు కేటాయించాలని సిబ్బందిపై దౌర్జన్యం చేశాడు.
ప్రయాణికుడి అసౌకర్యాన్ని చింతిస్తూ విమాన సిబ్బంది సీటు 30-సీలో కూర్చోవచ్చని తెలిపారు. కానీ, అవేం పట్టించుకోని ప్రయాణికుడు..రో నెంబర్ 25 కూర్చున్నాడు. పైగా పక్కనే ఉన్న మరో ప్రయాణికుడితో గొడవపడ్డాడు. అయితే, ఈ గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించిన ఉన్నతాధికారిపై దాడి చేశాడు. మెడపట్టుకుని విరిచే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.
విమానంలో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్యాసింజర్‌ను ఐదుగురు క్యాబిన్ సిబ్బంది కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అత్యవసర సమయాల్లో ప్రమాదాల నుంచి బయట పడేందుకు ఉపయోగించే ఎక్విప్‌మెంట్స్ ఉన్న రూమ్‌లో చొరబడడంతో కలకలం రేగింది. అయితే ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణికుడిని ఎయిరిండియా భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో తాను తప్పు చేసినట్లు నిందితుడు రాత పూర‍్వకంగా తెలిపినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో జూలై 9, 2023న సిడ్నీ-ఢిల్లీకి ప్రయాణిస్తున్న AI-301 విమానంలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు సదరు ప్యాసింజర్ రాతపూర్వకంగా క్షమాణలు చెప్పినట్లు తెలిపింది. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ మాట్లాడుతూ.. ఎయిర్‌లైన్స్ నిబంధల తీవ్రతను బట్టి సదరు ప్యాసింజర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
చదవండి : కాక్‌పిట్‌లో స్నేహితురాలు, పైలెట్ లైసెన్స్ క్యాన్సిల్
Comments
Please login to add a commentAdd a comment