Flight crew
-
విమానం ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలి?
ఈ రోజుల్లో చాలామంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో విమాన ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే విమాన ప్రయాణం చేసేటప్పుడు పలు నిబంధనలు పాటించాలని ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. విమాన ప్రయాణంలో ధూమపానం చేయకూడదు, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలాంటి నిబంధనలలో ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్‌ను మూసివేయాలని కూడా చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి? ట్రే టేబుల్ మూసివేయకపోతే ఏమైనా జరుగుతుందా? ఎయిర్ హోస్టోస్ హన్నా టెస్సన్(23) అమెరికాలోని కొలరాడోలో ఉంటున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలనే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రయాణికులు తాము చెప్పే సూచనలను పాటించనప్పుడు కోపం వస్తుందని అన్నారు. ప్రయాణీకులు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ మూసివేయాలని చెప్పినా, వెంటనే అమలు చేయరని ఆమె తెలిపారు. ఇలాంటి ఈ నిబంధనలను విమాన ప్రయాణికులు తప్పని సరిగా తెలుసుకోవాలని ఆమె అన్నారు. హన్నా తెలిపిన వివరాల ప్రకారం.. విమాన ప్రమాదాలు చాలావరకూ ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఓపెన్ ట్రే టేబుల్ కారణంగా ప్రయాణికులు గాయపడే అవకాశముంది. అందుకే ట్రే టేబుళ్లను మూసి వేయాలని ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. ఆహారం అందించడం ఒక్కటే తమ పని కాదని, ప్రయాణికుల భద్రతను చూడటం కూడా తమ పనే అని హన్నా తెలిపారు. విమానం టేకాఫ్ చేయడానికి ముందు విమానంలోని భద్రతా పరికరాలను తనిఖీ చేస్తామని, అంతే కాకుండా ప్రయాణికుల వింత ప్రవర్తనపై కూడా నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? విమానాలకు సంబంధం ఏమిటి?
మీరు ఎప్పుడైనా ఏదైనా మహానగరంలో రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని ఎత్తైన భవనాల పైన ఎరుపురంగు లైట్లు కనిపిస్తాయి. ఈ రెడ్ లైట్లు అలంకారం కోసం కాదని, దీని వెనుక ప్రత్యేక కారణం ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మహానగరాలు కాంక్రీట్ అడవులుగా ఎప్పుడో మారిపోయాయి. ఆ నగరాల్లో ఎత్తైన భవనాలన్నింటిపైనా ఈ తరహా లైట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ లైట్లు భారీ భవనాలపైననే ఎందుకు కనిపిస్తాయి? ఓ మాదిరి భవనాలపై ఎందుకు కనిపించవు? దీని వెనుక ఏదైనా ప్రభుత్వ మార్గదర్శకం ఉందా లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నారా? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భవనాల పైభాగంలో ఎరుపు రంగు దీపాలను అమర్చడానికి ప్రధాన కారణం విమాన భద్రత. ఈ లైట్లను ఏవియేషన్ అబ్స్ట్రక్షన్ లైట్లు లేదా ఎయిర్‌క్రాఫ్ట్ వార్నింగ్ లైట్లు అని అంటారు. ఆకాశహర్మ్యాలు, కమ్యూనికేషన్ టవర్లు, విండ్ టర్బైన్లు తదితర ఎత్తైన నిర్మాణాలు.. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పును కలిగిస్తాయి. ముఖ్యంగా దృశ్యమానత తగ్గినప్పుడు, అననుకూల వాతావరణంలో రెడ్ లైట్లు నిరంతర ఫ్లాషింగ్ సిగ్నల్స్‌ను విడుదల చేస్తాయి. అవి విమాన పైలట్లకు సులభంగా కనిపిస్తాయి. ఇది విమానాలకు హెచ్చరికలా పనిచేస్తుంది. విమానయాన అధికారులకు ప్రమాదాలను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇటువంటి లైట్ల ఏర్పాటుకు సంబంధించి పలు దేశాలలో కఠినమైన నిబంధనలను ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ భద్రతను నిర్ధారించడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ లైట్లను అమర్చనిపక్షంలో భవన యజమానులు జరిమానాలతో పాటు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎత్తైన భవనాలపైన ఉండే రెడ్ లైట్లు విమానాల కోసం నావిగేషనల్ ఎయిడ్స్‌గా కూడా పనిచేస్తాయి. వాటి స్థానాన్ని, దిశను గుర్తించడంలో సహాయపడతాయి. విమాన భద్రతతో పాటు, భవనాలపై కనిపించే ఎరుపురంగు లైట్లు సమీపంలోని ఎత్తైన నిర్మాణాలకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయి. ఇది కూడా చదవండి: దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి? -
ఫ్లైట్‌లో ఇండియన్ చెస్ స్టార్.. క్యాబిన్ క్రూ వినూత్న అభినందనలు!
భారత చెస్ యువ సంచలనం, ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు అంతటా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడి భారత్‌కు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన ప్రజ్ఞానందకు ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఇండిగో విమానంలో తల్లితో కలిసి ప్రయాణించిన ప్రజ్ఞానందకు విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది ఒక నోట్ అందించారు. చెస్ స్టార్ ప్రజ్ఞానంద, అతని తల్లితో కలిసి క్యాబిన్ క్రూ మెంబర్ దిగిన ఫొటోతో పాటు సిబ్బంది స్వయంగా రాసిన అభినందన నోట్ చిత్రాన్ని ఇండిగో సంస్థ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసింది. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ మాస్టర్ ప్రజ్ఞానంద తమ ఫ్లైట్‌లో ప్రయాణించడం గౌరవంగా ఉందని, మొట్టమొదటి ప్రపంచ కప్ ఫైనలిస్ట్‌గా నిలిచిన యువ ఛాంపియన్‌కు అభినందనలు అంటూ ప్రశంసించింది. ప్రజ్ఞానందను విమానంలో ఆన్‌బోర్డ్ చేయడం తమకు నిజంగా గౌరవం, సంతోషాన్ని కలిగిస్తోందని, దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన అందరికీ స్ఫూర్తి అంటూ క్యాబిన్ క్రూ స్వయంగా రాసి సంతకాలు చేసి ప్రజ్ఞానందకు అందించారు. అజర్బైజాన్లో జరిగిన ఫిడే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తలపడి రన్నరప్‌గా నిలిచారు. దీంతో ప్రజ్ఞానందకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా అభినందించారు. అలాగే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రశంసించి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బహుమతిగా అందించారు. ✈️ Taking chess to new heights! 🏆 We were honored to have Indian chess grandmaster Master R Praggnanandhaa on board. Congratulations to the young champion on becoming the first-ever World Cup finalist!#goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/RmwcMjmy3H — IndiGo (@IndiGo6E) August 31, 2023 -
ఏంటి బాబాయ్..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..?
ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నా కొందరు తంబాకు అలవాటును మానుకోరు. దాన్ని నోట్లో పెట్టుకుంటే గానీ కొందరికి బుర్ర పనిచేయదు. ఇంట్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇలా.. ఎక్కడ ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇక గోడ కనిపిస్తే చాలు ఉమ్మివేస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ అది ఏ ట్రైనో, బస్సో కాదండీ.. ఏకంగా విమానంలోనే.. వీడియోలో చూసిన విధంగా ఓ వృద్ధుడు విమానంలో ప్రయాణిస్తున్నాడు. నాలుక లాగేసిందో.. ఏమో..! గానీ విమానంలో ప్రయాణిస్తుండగానే తంబాకును జేబులో నుంచి తీశాడు. దాన్ని చేతిలో వేసుకునే నలిపి.. అమాంతం పెదవి కింది భాగంలో పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కరోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. फ्लाइट में हो या ट्रेन में एक खिली खैनी बहुत जरूरी हैं 😂😅 pic.twitter.com/GknxrYtJwY — छपरा जिला 🇮🇳 (@ChapraZila) August 26, 2023 వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'విమానంలోనే తంబాకు వేశావ్.. సరేగానీ ఎక్కడ ఉమ్మివేస్తావ్ బాబాయ్..!' అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు. వీరు మారరురా బాబు.. అంటూ మరో నెటిజన్ స్పందించాడు. నాలుక లాగేస్తుందా..? తాత అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.''నాకూ కొంచం పెట్టవా..' అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఇదీ చదవండి: గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..? -
విమానంలో మహిళలపై వేధింపులు.. అభ్యంతకర ఫొటోలు తీసి..
ఢిల్లీ: ఢిల్లీ-ముంబయి విమానంలో ఓ ప్రయాణికుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. విమాన సిబ్బందితో పాటు తోటి మహిళా ప్యాసింజర్ల అభ్యంతకర ఫొటోలను తీశాడు. బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. సదరు ప్రయాణికునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. SG 157 విమానం ఆగష్టు 2న ఢిల్లీ నుంచి ముంబయి బయలు దేరింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు సిబ్బంది, తోటి మహిళా ప్రయాణికుల అభ్యంతకర ఫొటోలను తీశాడు. ఇది గమనించిన సిబ్బంది అతన్ని పట్టుకుని ఫోన్లో నుంచి ఫొటోలను డిలీట్ చేయించారు. క్షమాపణలు కోరుతూ లేఖను రాయించారు. అయినప్పటికీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. నిందితున్ని శిక్షించాలని పోలీసులను కోరారు. 'విమానాల్లో లైంగిక వేధింపులు సహించరానివి. నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. పౌరవిమానయాన సంస్థ ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు.' అని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. ఇన్ని రోజుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని మహిళా కమిషన్.. ఢిల్లీ పోలీసులకు , విమానయాన సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన -
ఆమెకు నట్ ఎలర్జీ.. విమానం ఎక్కగానే ఏం చేసిందంటే..
విమానంలో ప్రయాణానికి సిద్ధమైన ఆ ప్రయాణికురాలు ఫ్లయిట్లో అందుబాటులో ఉన్న మొత్తం 48 పల్లీల ప్యాకెట్లనూ కోనుగోలు చేసింది. విమానంలో ఎవరూ పల్లిలు తినకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసింది. ఆమె ఇలా వింతగా ప్రవర్తించడం వెనుక పెద్ద కారణమే ఉంది. నట్ ఎలర్జీ బాధితురాలు తన విమాన ప్రయాణంలో మొత్తం 45 పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. 27 ఏళ్ల లియా విలియమ్స్ విమానయాన సంస్థ యూరోవింగ్స్కు చెందిన విమానంలో జర్మనీలోని ఇసెల్డోర్ఫ్ నుంచి లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయం వరకూ ప్రయాణించాల్సి ఉంది. ఈ సమయంలోనే ఆమె విమానంలో అందుబాటులో ఉన్న అన్ని పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. విమాన ప్రయాణం ప్రారంభించే ముందు ఆమె ఫ్లయిట్ క్యాబిన్ క్రూతో తనకున్న ఎలర్జీ గురించి చెప్పడంతో పాటు, ఇతరులు పల్లీలు తిన్నప్పుడు కూడా తనకు ఇబ్బందిగా ఉండటుందని, అందుకే విమానంలోని ప్రయాణికులకు పల్లీలు అందుబాటులో ఉంచవద్దని కోరింది. అయితే విలియమ్స్ విన్నపాన్ని వారు తిరస్కరించారు. ఇది ఎయిర్‌లైన్స్ నియమాలకు విరుద్ధమని తేల్చిచెప్పేశారు. దీంతో విలియమ్స్ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కోనుగోలు చేసింది. ఒక్కో ప్యాకెట్ మూడు యూరో(సుమారు రూ.200) చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది. తనకు ఎదురైన అనుభవం గురించి విలియమ్స్ మాట్లాడుతూ .. తన సమస్య గురించి చెప్పినప్పుడు క్యాబిన్ క్రూ అస్సలు పట్టించుకోలేదన్నారు. అప్పుడు తానే ఆ పల్లీల ప్యాకెట్లనన్నింటినీ కొనుగోలు చేశానని చెప్పారు. వాటి ఖరీదు ఎంతో తెలియనప్పటికీ, వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. ప్రయాణికుల సమస్యలను పట్టించుకోనందుకు యూరోవింగ్స్ సిగ్గుపడాలని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం
ఇటీవల కాలంలో టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా విమాన ప్రయాణాల్లో జరుగుతున్న వరుస ఘటనలు ఆ సంస్థ కీర్తి ప్రతిష్టల్ని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా, జులై 9న సిడ్నీ నుండి ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి ఎయిరిండియా సిబ్బందిపై దాడి చేశాడు. ఆపై దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. సిడ్నీ నుంచి ఓ ఎయిరిండియా విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే, ఆకాశంలో ఉండగా విమానంలోని ఓ ప్రయాణికుడు ఎకానమీ క్లాసులో తాను కూర్చున్న సీటు సరిగ్గా లేదని, బిజినెస్ క్లాస్‌లో సీటు కేటాయించాలని సిబ్బందిపై దౌర్జన్యం చేశాడు. ప్రయాణికుడి అసౌకర్యాన్ని చింతిస్తూ విమాన సిబ్బంది సీటు 30-సీలో కూర్చోవచ్చని తెలిపారు. కానీ, అవేం పట్టించుకోని ప్రయాణికుడు..రో నెంబర్ 25 కూర్చున్నాడు. పైగా పక్కనే ఉన్న మరో ప్రయాణికుడితో గొడవపడ్డాడు. అయితే, ఈ గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించిన ఉన్నతాధికారిపై దాడి చేశాడు. మెడపట్టుకుని విరిచే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విమానంలో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్యాసింజర్‌ను ఐదుగురు క్యాబిన్ సిబ్బంది కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అత్యవసర సమయాల్లో ప్రమాదాల నుంచి బయట పడేందుకు ఉపయోగించే ఎక్విప్మెంట్స్ ఉన్న రూమ్‌లో చొరబడడంతో కలకలం రేగింది. అయితే ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణికుడిని ఎయిరిండియా భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో తాను తప్పు చేసినట్లు నిందితుడు రాత పూర్వకంగా తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో జూలై 9, 2023న సిడ్నీ-ఢిల్లీకి ప్రయాణిస్తున్న AI-301 విమానంలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు సదరు ప్యాసింజర్ రాతపూర్వకంగా క్షమాణలు చెప్పినట్లు తెలిపింది. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ మాట్లాడుతూ.. ఎయిర్‌లైన్స్ నిబంధల తీవ్రతను బట్టి సదరు ప్యాసింజర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చదవండి : కాక్‌పిట్‌లో స్నేహితురాలు, పైలెట్ లైసెన్స్ క్యాన్సిల్ -
టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది
మాడ్రిడ్: టేకాఫ్ తీసుకోవడానికి వీల్లేనంత ఎక్కువ బరువుందని 19 మంది ప్రయాణికులను విమానం నుంచి దించేశారు..! ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని లాంజారోట్ నుంచి యూకేలోని లివర్‌పూల్‌కు ఈజీ జెట్‌కు చెందిన విమానం బుధవారం రాత్రి 9.45కు బయలుదేరాల్సి ఉంది. విమానంలో బరువు ఎక్కువగా ఉండటానికి తోడుగా రన్‌వే పొడవు తక్కువగా ఉండటం, అననుకూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్ కష్టంగా ఉందంటూ పైలట్ ప్రకటించారు. టేకాఫ్ తీసుకోవడం ప్రమాదకరమంటూ వారికి తెలిపారు. దీనికి ఏకైక పరిష్కారం బరువు కొద్దిగా తగ్గడమేనని వివరించారు. సుమారు 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా దిగిపోతే వారికి బహుమానంగా 500 పౌండ్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత విమానంలో పంపిస్తామని సర్దిచెప్పి 19 మంది ప్రయాణికులను విమాన సిబ్బంది కిందికి దించారు. దీంతో, రెండు గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది. చదవండి: వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్! -
విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్‌పై లైంగిక వేధింపులు
అమృత్సర్: అంతర్జాతీయ విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన ఘటన మరోటి వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం.. శనివారం షార్జా నుంచి అమృత్‌సర్‌కు బయల్దేరిన ఇండిగో సంస్థ అంతర్జాతీయ విమానంలో పంజాబ్‌లోని కోట్లీ గ్రామానికి చెందిన రాజీందర్ సింగ్ ప్రయాణిస్తున్నారు. విమానంలో తప్పతాగాక అతను విమాన మహిళా సిబ్బంది(ఎయిర్ హోస్ట్) ఒకరితో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా ఆమెను లైంగికంగా వేధించాడు. గొడవను గమనించిన తోటి విమాన సిబ్బంది వెంటనే అమృత్‌సర్‌లోని కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో విమానం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే రాజీందర్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. భారత శిక్షాస్మృతిలోని 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. చదవండి: కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన -
విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ
ఇటీవల కాలంలో పలు విమానాల్లో అనుచిత ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. విమానాల్లో సాంకేతిక లోపాలు, ప్రయాణికుల అసభ్య ప్రవర్తన వంటివి ఆందోళన రేపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరోటి చేరింది. విమానం టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులకు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన 8721 స్పైస్ జెట్ విమానం షెడ్యూల్ ప్రకారం ఉదంయ 7.20 గంటలకు టెర్మినల్ 3 నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే దాదాపు మూడు గంటలు ఆలస్యంగా అంటే 10.10 గంటలకు బయల్దేరింది. అయితే ముందుగా వాతావరణం అనుకూలించడంతో విమానం టేకాఫ్‌కు ఆలస్యం అవుతోందని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. అనంతరం కొద్ది సమాయానికి సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానంలోకి ఎక్కి రెండున్నర గంటలకు పైగా నిరీక్షించిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విమానం బయలుదేరడంలో ఆలస్యం కావడంపై విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చివరకు ఉదయం 10.10 గంటలకు ఆ విమానం టేకాఫ్ అయ్యింది. చదవండి: వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్..ఎక్కడంటే? -
SpiceJet: ఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్‌లో వికృత చేష్టలు?!
ఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన ఘటన మరిచిపోక ముందే.. మరో ప్రయాణికుడి వికృత చేష్టల వ్యవహారం?! వెలుగు చూసింది. ఢిల్లీ-హైదరాబాద్‌కు చెందిన స్పైస్‌జెట్ విమానంలో ఇవాళే(సోమవారం) ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్పైస్‌జెట్ విమానం ఎస్జీ-8133.. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో ఓ ప్యాసింజర్ క్యాబిన్ సిబ్బందిలోని ఓ యువతితో అనుచితంగా ప్రవర్తించాడు.యువతిని అసభ్యంగా తాకినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో తోటి సిబ్బంది ఆ యువతికి మద్ధతుగా వచ్చారు. కాసేపటికి ఈ విషయాన్ని పైలట్ ఇన్ కమాండ్, సెక్యూరిటీ స్టాఫ్‌కు సిబ్బంది తెలియజేశారు. దీంతో.. ఆ ప్రయాణికుడిని, అతనితో ఉన్న మరో ప్యాసింజర్‌ను దించేశారు. వారిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పినట్లు స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుడి నుంచి క్షమాపణ పత్రం తీసుకున్నప్పటికీ.. వ్యవహారం ముదరకుండా ఉండేందుకు వాళ్లను దించేసినట్లు తెలుస్తోంది. అయితే తోటి ప్రయాణికుల్లో కొందరు మాత్రం అది కావాలని జరిగిన ఘటన కాదని, ఇరుకుగా ఉండడంతో పొరపాటున తగిలాడనని చెప్తుండడం గమనార్హం. #WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV — ANI (@ANI) January 23, 2023 -
విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. చేయి దించి మాట్లాడంటూ..
-
Video: విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. చేయి దించి మాట్లాడంటూ..
కారణం ఏంటో తెలియదు కానీ విమానంలో కొంతమంది యువకులు తగువులాడుకున్నారు. చిన్నగా మొదలైన వీరిమధ్య గొడవ మాటామాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. విమానం గాల్లో ఉండగా.. తోటి ప్రయాణికుల ముందే రౌడీల్లా తన్నుకున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌కు చెందిన థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో చోటుచేసుకుంది. బ్యాంకాంక్ నుంచి కోల్‌కతా వస్తున్న థాయ్ స్మైల్ ఎయిర్వేస్ టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లో ఉండగా అద్దాలు పెట్టుకున్న ఓ యువకుడు తన ఎదురుగా ఉన్న బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తితో గొడవకు దిగాడు. విమానంలో ప్రయాణికులందరూ చూస్తుండగానే ఇద్దరు కొద్దిసేపు వాదులాడుతుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు విమాన సిబ్బంది, సహా ప్రయాణికులు ప్రయత్నించినా గొడవ సద్దుమణగలేదు. ఇంతలో అద్దాలు పెట్టుకున్న వ్యక్తికి మద్దతుగా తన స్నేహితులు రావడంతో గొడవ ఇంకాస్తా పెద్దది అయ్యింది. దీంతో అందరూ కలిసి ఎదుటి వ్యక్తిపై చేయిచేసుకున్నారు. ఒక్కడిని చేసి అతడిపై అందరూ దాడి చేశారు. వతల వ్యక్తి ఒక్కటే కావడంతో తనను తాను రక్షించుకుంటూ వారి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ తతంగాన్నంతా ఓ ప్రయాణికుడు రికార్డ్ చేయగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Not many smiles on this @ThaiSmileAirway flight at all ! On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone. Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l — VT-VLO (@Vinamralongani) December 28, 2022 ఇందులో.. ఇద్దరిలో ఒకరు.. కూర్చోని నెమ్మదిగా మాట్లాడండి అని చెబుతుండగా.. ఎదుటి వ్యక్తి ముందు చేయి కిందకు దించు అని అరవడం వినిపిస్తోంది. సెకన్ల వ్యవధిలోనే వీరి మధ్య గొడవ పెరగడంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. విమానంలో అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. రైలు, బస్సులో సీటు కోసం గొడవ పడటం చూశాం. కానీ విమానంలో ఒకరినొకరు తన్నుకోవడం ఏంట్రా బాబూ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. అంతేగాక ఇప్పటివరకు, థాయ్ స్మైల్ ఎయిర్వేస్ ఈ ఘటనపై స్పందించలేదు. చదవండి: Bomb Cyclone: జారిపోతున్న కార్లు.. మంచులా మారుతున్న వేడి నీళ్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నా..!
విమానంలో అందించే ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌తో గొడవ పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది. అందులోని గుర్ప్రీత్ సింగ్ హాన్స్ అనే మరో ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో తీసి డిసెంబర్ 19న ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దురదృష్టవశాత్తు ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దూర ప్రాంతాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల్లో అనువైన ఆహారం అందించాలి. కానీ అలా జరగటం లేదు. ఇచ్చిన ఆహారం తిని కొందరు సర్దుకోగలరు కానీ అందరు అలా ఉండలేరు. ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చూశాను. ’ అని రాసుకొచ్చారు గుర్ప్రీత్ సింగ్ హాన్స్. Unfortunately, I mean it Unfortunately I book a flight with @IndiGo6E from #Istanbulairport to @DelhiAirport people are right staff are right but @IndiGo6E can't. Every international LONG DISTANCE(we can manage from Dubai to India ) flight has a food choices video in front — Er. Gurpreet Singh Hans☬ (@Iamgurpreethans) December 18, 2022 వీడియో ప్రకారం.. ఎయిర్‌హోస్టెస్‌తో ఓ ప్రయాణికుడు వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘నీ వల్ల విమానంలో గందరగోళం నెలకొంది. నీ బోర్డింగ్‌లో ఉన్న ఆహారమే అందిస్తున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి.’ అని ఎయిర్‌హోస్టెస్ సూచించారు. ఈ క్రమంలోనే వాగ్వాదం జరిగింది. మరో సిబ్బంది కలుగ జేసుకుని సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. సిబ్బంది పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ క్రమంలో ఆమె సర్వెంట్, ఒక ఉద్యోగిని, నేను మీ సర్వెంట్‌ని కాదు అని పేర్కొన్నారు ఆ ప్రయాణికుడు. ఎయిర్‌హోస్టెస్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లగా వివాదం సద్దుమణిగింది. అయితే, ఈ సంఘటనపై ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. Even staff checked our boarding pass before giving us food which is not right for long distances #internetflight @IndiGo6E @AAI_Official @DelhiAirport @GovtOfIndia_ one thing you must need to realise is that "we choose you, you can't" pic.twitter.com/2uLIqhG5vw — Er. Gurpreet Singh Hans☬ (@Iamgurpreethans) December 19, 2022 ఇదీ చదవండి: ఇదేందయ్యా రాహుల్.. కాంగ్రెస్ కార్యకర్తకు చేదు అనుభవం! -
సౌదీ ఏవియేషన్ చరిత్రలో తొలిసారి..
Women-only Crew Operates: గల్ఫ్ దేశాల్లో మహిళలకు ఎలాంటి ఆంక్షలు ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి సౌదీ అరేబియాలో తొలిసారిగా ఒక విమానాన్ని మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు. అందులో మొత్తం మహిళా సిబ్బందే పనిచేస్తారు. ఇది మహిళా సాధికారతకు ఒక పెద్ద నిర్వచనంగా చెప్పవచ్చు. ఈ విమానాన్ని ఇటీవలే ప్రారంభించామని ఒక చిన్న దేశీయ ప్రయాణాన్ని కూడా చేసిందని సౌదీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు ఎర్రసముద్ర తీరం నుంచి జెడ్డా వరకు విమానాన్ని నడిపారని కూడా తెలిపారు. ఫ్లైడీల్ ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తుండగా, సౌదీ విమానయాన చరిత్రలో తొలిసారిగా సరికొత్త ఏ 320 విమానాన్ని మొత్తం మహిళా సిబ్బందితో నడిపించిందని అన్నారు. అంతేకాదు ఈ విమానాన్ని నడిపిన మహిళా ఫైలెట్ కూడా అత్యంత పిన్న వయసురాలు కావడం మరో విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో ఎక్కువ శాతం మహిళల భాగస్వామ్యం ఉండేలా కృషి చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ విమానాన్ని పూర్తిగా మహిళలే నిర్వహించేలా చేసింది. For the first time in Saudi aviation history!🇸🇦 #flyadeal operated the first flight with all-female crew, majority of which are Saudis by the newest A320 aircraft. Flight 117, flew from #Riyadh to #Jeddah ✈️💜 pic.twitter.com/fWo08hYMd7 — طيران أديل (@flyadeal) May 20, 2022 (చదవండి: వైరల్ వీడియో.. ఎయిర్‌పోర్టులో కన్వేయర్ బెల్ట్‌పై మృతదేహం?) -
సంచలనం, వంట నూనెతో అద్భుతం..కుకింగ్ ఆయిల్‌తో కాస్ట్లీ విమానం నడిపారు!
సీట్లు నిండినా..గల్లా ఖాళీ అవుతుంది ఇదీ ప్రస్తుతం విమానయాన పరిస్థితి. అందుకే విమానాయన సంస్థలు ఆవ నూనె, వంట నూనెతో విమానాల్ని నడిపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మంచి ఫలితాల్ని రాబడుతున్నాయి. తాజాగా 496 మంది ప్రయాణించే కాస్ట్లీ విమానం 'ఎయిర్ బస్ ఏ380'లో వంటింట్లో వాడే వంట నూనె ఫ్యూయల్‌గా ఉపయోగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండానే విమానం నిర్దేశించిన ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గాలి నుంచి కాదు ఆవ మొక్క నుంచి ఇంధనం ఐదేళ్ల క్రితం గాలి నుంచి విమానం ఇంధనం తయారవుతుందని అనడంతో విమానయానం కష్టాలు ఇక తీరిపోయినట్లేనని భావించారు. ఎందుకంటే అసలు విమానయానం కష్టాలన్నీ ఇంధనం వల్లనే జరుగుతున్నాయి. నానాటికి పెరిగిపోతున్న చమురు ధరలతో..వాటి ఖర్చు ఆకాశం నుంచి అంతరిక్షం దాటుతోంది. దాంతో ఆల్ట్రనేటీవ్ ఫ్యూయల్ వైపు అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ అదెందుకో కార్యచరణకు నోచుకోలేదు. కానీ గతేడాది భారత శాస్త్రవేత్త,జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పునీత్ ద్వివేదీ బృందం ఆవాల మొక్క ద్వారా విమానం ఇంధనం తయారవుతుందనగానే ఆశలు చిగురించాయి. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసే నూనెతో విమానం ఇంధనం తయారు చేయోచ్చని పునీత్ ద్వివేది తెలిపారు. ద్వివేదీ గత 4 సంవత్సరాలుగా దీనిపై పరిశోధనలు చేస్తుండగా..ఈ ప్రాజెక్టును15 మిలియన్ల డాలర్లతో అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చేపట్టింది. వంట నూనెతో అద్భుతాలు ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాన్ని ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్ బస్ ఏ380 ఫ్లైట్‌ను ఫ్రాన్స్‌లో ట్రయల్స్ నిర్వహించారు. సంచలనం ఏంటంటే ఈ విమానంలో వంటింట్లో వాడే వంటనూనె ( ఇది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(saf అని కూడా పిలుస్తారు)ను ఉపయోగించడం. ఈ విమానం రోల్స్ రాయిస్ ట్రెంట్ 900 ఇంజన్ సాయంతో మార్చి 25న టౌలౌస్‌లోని బ్లాగ్నాక్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. మార్చి 29న టౌలౌస్ నుండి నైస్‌కు వెళ్లేందుకు అదే నూనెను ఉపయోగించి ఏ380 ప్లైట్‌ను మరో ట్రైల్ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇంధన పనితీరు బాగున్నట్లు గుర్తించారు. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ 'హైడ్రోప్రాసెస్డ్ ఎస్టర్స్, ఫ్యాటీ యాసిడ్స్' లేదా హెచ్ఈఎఫ్ఏ నుండి ఈ ప్రత్యేకమైన కుకింగ్ ఆయిల్‌ను తయారు చేసింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఆయిల్‌ను విమానాల్లో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. మార్చి2021లో వైడ్ బాడీ ఏ 350 ఫ్లైట్‌లో, గత అక్టోబర్‌లో ఏ319 నియో అనే విమానంలో ఈ ఆయిల్‌ను ఫ్యూయల్‌గా ఉపయోగించారు. తాజాగా కాస్ట్లీ విమానం ఏ380 లో ఉపయోగించి టెస్ట్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తించారు. కాగా ఎయిర్‌బస్ యాజమాన్యం తన విమానాలన్నింటిలో ఈ కుకింగ్ ఆయిల్‌ను ఉపయోగించేందుకు సర్టిఫికేట్ పొందాలని చూస్తుంది. అప్పటి వరకు ప్రయోగాలు కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి: ఈ విమానంలో జర్నీ బాగా కాస్ట్లీ గురూ! -
నాది ఎక్స్పోజింగ్ అయితే! మరి ఆమె చేసిందో?
సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు సోషల్ మీడియా సాక్షిగా చర్చలు నడవడం సహజం. మిస్ యూనివర్స్-2012 ఒలీవియా కల్పో తాజాగా తనకు ఎదురైన ఓ అనుభవం గురించి పోస్ట్ చేయగా.. అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన ప్రకారం.. మెక్సికోలోని కాబో శాన్ లుకాస్ అనే రిసార్ట్‌కి తన సోదరి, బాయ్‌ఫ్రెండ్‌తో పాటు బయలుదేరింది. ఆ సమయంలో ఆమె పైన టాప్‌తో డ్రెస్ వేసుకుని ఉంది. అయితే క్లీవేజ్ కనిపించేలా ఆ డ్రెస్సు ఉండడంతో సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించలేదు. దీంతో తన బాయ్‌ఫ్రెండ్ క్రిస్టియన్ మెక్కాఫెరే హూడీని తగిలించుకుని ఆమె ఫ్లైట్ ఎక్కింది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన ఆమెకు షాక్ తగిలింది. తనకంటే దారుణమైన దుస్తులతో ఉన్న మహిళను విమానంలోకి సిబ్బంది అనుమతించారు. దీంతో అక్కడి ఘటనతంతా వరుసగా ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఒలీవియా సోదరి అరోరా. తనకు ఎదురైన అమానం గురించి అందరికీ తెలియాలనే తాను ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఓ మీడియా హౌజ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది ఒలీవియా. Come on! Who dresses like that to go on a plane. I’m glad @AmericanAir made her cover up. People today think they can just walk around scantily clad and we’re just supposed to accept it. @oliviaculpo dress like an adult. #teamamericanairlines — Missy (@melissa_U25) January 15, 2022 PR stunt, it's the simplest explanation. It worked too, BTW. — 🍊💊Jorj X McKie🍊💊 (@Jorj_X_McKie) January 15, 2022 Funny how the sister who thinks Olivia looks cute and appropriate is covered from head to toe. You look like you’re wearing a bra and spanks. Try adulting and put some actual clothes on. You’d think a former Miss Universe would have some standards. 🤷🏻♀️ — Angela (@hotstuffmedic) January 15, 2022 -
విమానంలో వెకిలి చేష్టలతో రచ్చరచ్చ.. సీటుకు కట్టేసి దేహశుద్ధి
వాషింగ్టన్: మహిళలపై వేధింపులు ఎక్కడా ఆగడం లేదు. చివరకు విమానంలో కూడా మహిళలకు భద్రతా లేకుండాపోయింది. విమాన సిబ్బందితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రైవేటు భాగాలపై అసభ్యంగా తాకుతూ వేధించడంతో సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసి అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. అతడిని సీటుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాకు చెందిన 22 ఏళ్ల యువకుడు మాక్స్వెల్ బెర్రీ ఫిలడెల్ఫియా నుంచి మియామీకి వెళ్లేందుకు ఫ్రంట్టైర్ విమానం ఎక్కాడు. అనంతరం మాక్స్వెల్ విమానంలో నానా హంగామా చేశాడు. విమాన మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు తిడుతూ వాగ్వాదానికి దిగాడు. తోటి ప్రయాణికులతో గొడవకు దిగాడు. మరింత రెచ్చిపోయి మహిళా సిబ్బంది ఛాతీపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. జననాంగాలపై చేయి వేసేందుకు ప్రయత్నించగా సిబ్బంది పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. అతడి తీరుతో విసుగెత్తిన విమాన సిబ్బంది వెంటనే రెండు చేతులు పట్టుకుని అతడిని సీటుకు కట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేశారు. అయినా కూడా అతడి నోరు అదుపులోకి రాలేదు. పచ్చి బూతులు తిడుతూనే ఉన్నాడు. కాపాడండి అంటూ అరుస్తూ కూర్చున్నాడు. ఈ వీడియోను రికార్డ్ చేసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు దాదాపు 4 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. -
ఇండిగో విమానానికి తప్పిన భారీ ప్రమాదం
సాక్షి, బెంగళూరు: లక్నో నుండి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ల్యాండిగ్‌కు కొన్ని క్షణాల ముందు క్యాబిన్ డిప్రెజరైజేషన్కు గురి కావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే పైలట్, సిబ్బంది అప్రమత్తతతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. తాజా నివేదికల ప్రకారం ఇండిగో విమానం బెంగళూరుకు 240 కిలోమీటర్ల దూరంలో, 11,000 అడుగుల ఎత్తులో ఉండగా ఇండిగో ఫ్లైట్ 6ఈ-6654 క్యాబిన్లో ఇబ్బంది ఎదురైంది. దీంతో విమాన సిబ్బంది అత్యవసర ప్రమాద సంకేతం మేడేను ప్రకటించారు. తక్షణమే ప్రయాణీకులకు ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. అనంతరం బెంగళూరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి విమాన లాండింగ్ క్లియరెన్స్ కోరారు. వారి అనుమతి మేరకు విమానాన్ని సురకక్షితంగా ల్యాండ్ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ విమానాన్ని బెంగళూరు సాంకేతిక బృందం తనిఖీ చేస్తోంది. అలాగే ఈ అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేస్తోంది. క్యాబిన్ డిప్రెషరైజేషన్ ఇబ్బంది ఏర్పడితే అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ...‘మేడే’ లేదా ‘పాన్ పాన్’ అనే ప్రమాద సంకేతాన్నివ్వాలి. సంబంధిత ఏటీసీ అధికారుల అనుమతితో ల్యాండ్‌కావాలి. ప్రయాణీకులందరికీ ఆక్సిజన్ మాస్క్‌లు అందజేయాలి. కాగా గత ఏడాది మే నెలలో పాకిస్తాన్‌లోని కరాచీ ఎయిర్పోర్ట్ సమీపంలో ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందు మేడే మేడే సందేశం ఇస్తూనే.. విమానం కుప్పకూలిన ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఆ విమానాన్ని ఇండియా ఏం చేయబోతోంది?
ఢాకా నుంచి మస్కట్ కు 173 మంది ప్రయాణికులతో బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం ‘మెక్ డానెల్ డగ్లాస్ ఎం.డి. 83’.. ఐదున్నరేళ్ల క్రితం రాయ్‌పుర్ (ఛత్తీస్‌గఢ్) లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆరోజు నుంచీ ఈరోజు వరకు ఆ విమానం అదే ప్లేస్ లోనే ఉండిపోయింది! తీసుకెళ్లమంటే బంగ్లాదేశ్ తీసుకెళ్లడం లేదు! పోనీ పార్కింగ్ చార్జీలైనా కట్టమంటే కట్టడం లేదు. (1.25 కోట్లు). ‘ఓర్నాయనోయ్.. అంతా!’ అంటోంది. ఎందుకు ఆ విమానం ఇంకా అక్కడ ఉంది? వాళ్ల అధికారులెవరూ ఎందుకు వచ్చి తీసుకెళ్లడం లేదు! ఇప్పుడా విమానాన్ని ఇండియా ఏం చేయబోతోంది? ఇది పాత కథ మాత్రమే కాదు, ఇప్పటికైతే అంతులేని కథ కూడా! ఐదున్నరేళ్ల క్రితం 2015 ఆగస్టు 7 తేదీ రాత్రి ఏడు గంటలకు ‘మెక్ డానెల్ డగ్లస్ ఎండి 83’ అనే బంగ్లాదేశ్ బోయింగ్ విమానం మన దేశంలో దిగే పని లేకుండానే దిగింది! బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బయల్దేరిన ఆ విమానం నేరుగా ఒమన్ రాజధాని మస్కట్ వెళుతున్నప్పుడు గగనతలంలో ఒక ఇంజిన్ చెడిపోయింది. పైలట్ ఆ సంగతిని గుర్తించేటప్పటికి వారణాసి, రాయ్‌పుర్ మధ్య గగనతలంలో ఉంది. అప్పటికప్పుడు అత్యవసర ల్యాండింగ్‌కి దగ్గరగా ఉన్న రాయ్‌పుర్ (ఛత్తీస్ గఢ్) లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో విమానాన్ని దింపేశాడు. లోపల ఉన్న 173 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే ఈ ‘డగ్గాస్ 83’ విమానం మాత్రం తిరిగి బంగ్లాదేశ్ చేరుకోలేదు. ఆనాడే కాదు, మర్నాడు, ఆ మర్నాడు, ఆ నెల, ఆ తర్వాతి నెల, ఆ ఏడాది, తర్వాతి ఏడాదీ.. పైకి లేవనే లేదు. ఇవాళ్టికీ ఉన్నచోటే ఉండిపోయింది. ఎయిర్‌పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ఎ.ఎ.ఐ.) పార్కింగ్ స్థలం అది. అక్కడ పార్క్ చేసినందుకు బంగ్లాదేశ్ వాళ్ల ‘యునైటెడ్ ఎయిర్వేస్’ (ఈ డగ్లాస్ 83 విమానం వాళ్లదే) కోటీ 25 లక్షల రూపాయల పార్కింగ్ చార్జీలను ఎ.ఎ.ఐ.కి బకాయీ పడింది. ఇమ్మంటే ఇవ్వదు. విమానాన్ని తీసుకుపొమ్మంటే పోదు. చూసి చూసి ఏదో ఒకటి తేల్చమని ఈ జనవరి 18న ఎ.ఎ.ఐ. మరొకసారి గుర్తుచేసింది. విజ్ఞప్తులు, ఆదేశాలు పని చేయకపోవడంతో ఇప్పుడు లీగల్‌గా తేల్చుకునేందుకు సిద్ధమైంది. రాయ్‌పుర్ స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే ఎనిమిది పార్కింగ్ బేస్‌లు. వాటిల్లో ఒక విమానం అక్కడే ఫిక్స్ అయిపోవడంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ గత ఐదున్నరేళ్లు గా ఆ ఎయిర్పోర్ట్ సర్దుకుపోతోంది. ఎంత సర్దుకుపోయినా ఒక హద్దయితే ఉంటుంది. ఆ హద్దు కూడా దాటి, ఇప్పుడిక ఆ విమానాన్ని అక్కడి నుంచి లేపే ప్రయత్నం మొదలుపెట్టింది ఎ.ఎ.ఐ. డంప్ యార్డ్‌కు పంపడానికి లేదు. పార్కింగ్ ప్లేస్‌లో అలా పడి వుంటుందిలే అనుకోడానికీ లేదు. పైగా రెండు మూడు మరమ్మతులు చేస్తే పైకి ఎగిరే విమానమే అది. ‘కొనేవాళ్ల కోసం చూస్తున్నాం. కాస్త టైమ్ ఇవ్వండి’ అని మాత్రం బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్ అంటోంది. ‘‘ఏమైనా ఇంకో వారం మాత్రమే చూస్తాం’’ అని రాయ్‌పుర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ అంటున్నారు. అని రెండు రోజులు అయింది. అసలు డగ్లాస్ 83 అత్యవసరంగా ల్యాండ్ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్‌పుర్ రాలేదు! వాళ్లొచ్చి వెళ్లిన కొన్ని నెలల వరకూ మళ్లీ అట్నుంచొకరు ఇటు రాలేదు. ఆ వచ్చినవాళ్లు చెడిపోయిన ఇంజన్ తీసి కొత్తది బిగించారు. ఇక అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా ‘ఎగిరే యోగ్యత పత్రం’ రావాలి. అది రాలేదు. ఇది ఎగర లేదు! ఏళ్లు గడిచిపోతున్నాయి. మనవాళ్లు ఇప్పటికి ఉత్తరాలు, ఈమెయిళ్లు కలిపి సుమారుగా ఓ 50 వరకు పంపారు. నెల నెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఒకటే సమాధానం.. ‘ఎగిరే యోగ్యత పత్రం’ అందగానే తీసుకెళతాం అని! రాయ్‌పుర్ ఎయిర్పోర్ట్ ఇబ్బందులు రాయ్‌పుర్‌కు ఉన్నాయి. ఇక్కడి నుంచి రోజూ 27 విమానాలు పైకి లేస్తాయి. 27 విమానాలు కిందికి దిగుతాయి. ఉదయం 8–10 గంటల మధ్య, సాయంత్రం 4–6 మధ్య మొత్తం నాలుగు గంటల పాటు ఎనిమిది పార్కింగ్ బేస్‌లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లాస్ 83 కారణంగా ఆ సమయంలో వేరొక ప్రదేశంలో విమానాలను ఉంచవలసి వస్తోంది. ఇది మన వైపు ఇబ్బంది. ఇక వాళ్ల వైపు.. యుౖ¯ð టెడ్ ఎయిర్వేస్ నష్టాల్లో కూరుకుపోయి ఉంది. 2016 నుంచి ఒక్క విమానం కూడా పొయ్యి లోంచి లేవని పిల్లిలా పైకి ఎగరనేలేదు. ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ‘కార్గో అప్రోచ్ ఏరియా’లో వదిలేశారు. అవి కూడా అక్కడ కార్గో ఫ్లయిట్స్ కాలికీ చేతికీ అడ్డం పడుతున్నాయి. ఈ పరిస్థితిలో రాయ్‌పుర్ విమానాశ్రయానికి పార్కింగ్ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక.. చివరికి.. ‘మీరే ఓ గిరాకీని వెతికి పట్టుకుని, డగ్లాస్ 83ని అమ్మేసి, మీ పార్కింగ్ ఛార్జీలను మినహాయించుకుని, మిగతా డబ్బును పంపించండి’ అని యునైటెడ్ ఎయిర్వేస్.. మన ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాను కోరవచ్చు. ఆ రోజు ఏం జరిగింది? విమానం బంగ్లాదేశ్లోంచి పైకి లేచింది. వారణాసి–రాయ్‌పుర్ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఇంజిన్ పాడైంది. లోపల 173 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని పైలట్ షాబాజ్ ఇంతియాజ్ ఖాన్ గ్రహించాడు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంజన్‌లోంచి మంటలు వచ్చి, ఇంజన్ బద్దలెపోయింది. లోపల కూర్చొని ఉన్న ప్రయాణికులకు ఇదేమీ తెలియదు. విమానం కుదుపులకు లోనవడం మొదలైనప్పుడేమైనా కొందరు గ్రహించగలిగారేమో. లక్కీగా విమానంలో లోపల ఒక ఫ్లయిట్ ఇంజినీరు ఉన్నాడు. పరిస్థితి మరింత క్షీణించకుండా అతడు చేయగలిగిందేదో చేశాడు. పైలట్ వెంటనే తొలి ‘మేడే కాల్’ను గాలిలోకి పంపించాడు. మేడే కాల్ అంటే ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్‌కి అనుమతి ఇవ్వండి’ అని విజ్ఞప్తి చేసే సంకేతం. ఆ సంకేతాన్ని కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి పంపితే దురదృష్టవశాత్తూ అది చేరలేదు! కోల్‌కతా చెబితేనే రాయ్‌పుర్ చేస్తుంది. ఏమైతే అయిందని రాయ్‌పుర్‌లో దించేయాలని పైలట్ నిర్ణయించుకున్నాడు. అయితే ఒక విమానాన్ని అత్యవసరంగానే అయినా ల్యాండ్ చేయించే అధికారం రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌కు లేదు. కోల్‌కతా నుంచి ఆర్డర్స్ రావాలి. దురదృష్టంతోపాటే అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలెట్ ఇచ్చిన మేడే కాల్‌ను ముంబై నుంచి కోల్‌కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ పైలట్ పికప్ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు అందించారు. కోల్‌కతా ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే రాయ్‌పుర్ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండ్‌కి అనుమతి ఇవ్వమని కోరారు. రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్ చార్ట్ లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్‌లో ఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం అయితే దిగింది కానీ, ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకుండా పోయింది. 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి ఆగస్టు 8 రాత్రి గం. 10.27కు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్ తీసుకెళ్లింది. -
విమానంలో చైనా వ్యక్తి వాంతులు..
ముంబై : చైనా నుంచి ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ఆయా దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారతీయులకు కూడా వ్యాప్తి చెందుతోందని ప్రజలకు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి పుణె వెళ్లున్నఎయిర్ ఇండియా విమానంలో చైనాకు చెందిన వ్యక్తి(31) రెండు సార్లు వాంతులు చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది పూణె విమానశ్రయానికి చేరుకోగానే. మున్సిపల్ కార్పొరేషన్ నాయుడు ఆస్పత్రికి తరలించి అక్కడ ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి అతని నమూనాలు సేకరించి వాటిని పూణెలోని జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు(ఎన్ఐవీ) పంపారు. (కరోనా భయం; వీడియో కాల్లో ఆశీర్వాదాలు) కాగా చైనా వ్యక్తికి ఇప్పటికే దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయని, వాటి నమూనాలు ఎన్ఐవీకి పంపామని, పూర్తి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని వైద్యులు తెలిపారు. అదే విధంగా పూణెలో విమానాన్ని శుభ్రపరిచి తిరిగి విమానం ఢిల్లీ చేరేందుకు నాలుగు గంటలు ఆలస్యమెందని పూణే విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఇక చైనాలోని వుహాన్‌లో మొదటగా గుర్తించిన కరోనా భారత్‌తో సహా 25 దేశాలకు వ్యాప్తి చెందింది. కేరళలలో ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. (కర్నూలు యువతిని ఇండియాకు తీసుకోస్తామని మంత్రి హామీ) -
విమానంలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
కోల్కత్తా : విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. థాయ్‌లాండ్‌కు చెందిన మహిళ(23) నిండు గర్బిని. అయినప్పటికీ ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం క్యూఆర్ 830లో దోహా నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణం చేస్తోంది. కాగా తెల్లవారు జామున 3 గంటలకు మహిళకు పురిటి నొప్పులు మొదలవ్వడంతో క్యాబిన్ సిబ్బంది సహాయంతో మహిళ ప్రసవించింది. అనంతరం అత్యవసర ల్యాండింగ్ కింద కోల్‌కత్తాలో విమానం ల్యాండింగ్ చేయడానికి పైలట్ అధికారుల అనుమతి కోరారు. దీనికి కోల్కత్తా ఏటీసీ ఒప్పుకోవడంతో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. అక్కడి నుంచి మహిళను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. -
దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పైలట్..
ఎడిన్బర్గ్ : బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఓ పైలట్ ప్రయాణికులకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. జర్మనీలో ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్‌ను స్కాట్లాండ్లో ల్యాండ్ చేశాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ‘బీఏ 146’ విమానం 100 మంది ప్రయాణికులతో లండన్ నుంచి జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్కు బయలుదేరింది. కానీ, అది దారితప్పి 500 మైళ్లు అదనంగా ప్రయాణించింది. నేరుగా తూర్పు దిశగా వెళ్లకుండా ఉత్తరం వైపుకు దూసుకెళ్లింది. చివరకు స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. ఫ్లైట్‌లో ఉన్నవారంతా అది డ్యూసెల్డార్ఫ్ అనే అనుకున్నారు. అయితే,‘వెల్కమ్ టు ఎడిన్బర్గ్’ అని విమానం కాక్‌పిట్ నుంచి అనౌన్స్మెంట్ వినగానే ఆశ్చర్యంలో మునిగారు. పైలట్ జోక్ చేస్తున్నాడేమోనని భావించారు. అది ఎడిన్బర్గ్ అని తెలిసి నోరెళ్లబెట్టారు. డ్యూసెల్డార్ఫ్కు తరచుగా ప్రయాణించే సోఫీ కూక్ అనే మహిళ బీబీసీతో మట్లాడుతూ.. ఎడిన్‌బర్గ్‌కు చేరుకున్నామని పైలట్ చెప్పగానే ఆశ్చర్యపోయాను. అతను చెప్పిందే నిజమేనని గ్రహించాను. చేసిన ఘటనకార్యం చాలదా అన్నట్టు విమాన సిబ్బంది.. ‘మీరంతా డ్యూసెల్డార్ఫ్కు వెళ్లాలనుకుంటున్నారు కదా’ అని అడిగారని ఆమె మండిపడ్డారు. ‘అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ఫ్లైట్ మ్యాప్ ప్రకారమే విమానం ప్రయాణం చేసింది. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు’ అని పైలట్ చెప్పుకొచ్చాడు. కాగా, రెండున్నర గంటల అనంతరం విమానం మళ్లీ జర్మనీ బయలుదేరింది. కాగా, అనుకోకుండా ఇలా కలిసొచ్చిందని.. ఇదొక బోనస్ ట్రిప్ అని మరి కొందరు వ్యాఖ్యానించారు. విమానం రూట్ ప్లాన్ ఇదిలాఉండగా.. ప్రయాణికుల విలువైన సమయాన్ని రాంగ్ ల్యాండింగ్ ద్వారా వృథా చేసినందుకు బ్రిటీష్ ఎయిర్వేస్ క్షమాపణలు కోరింది. ఫ్లైట్‌మ్యాప్‌లో డబ్ల్యూడీఎల్ సంస్థ చేసిన తప్పిదం వల్లనే ఈ ఘటన జరిగిందని బ్రిటీష్ ఎయిర్వేస్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి రూ.20 వేల నష్టపరిహారం చెల్లించింది. ఘటనపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఫ్లైట్‌ప్లాన్‌లు తారుమారైన వ్యవహారాన్ని కనుగొంటామని తెలిపింది. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానాన్ని జర్మనీ కంపెనీ డబ్ల్యూడీఎల్ ఏవీయేషన్ సంస్థ లీజ్ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. -
క్యాలీ.. కో-పైలట్
లండన్: చిత్రంలో చూశారా.... పెంపుడు కుక్కకు గుర్తింపు కార్డు చూస్తుంటే చిత్రంగా ఉంది కదూ.... ఇదంతా ఆకతాయి చేష్ట అనుకుంటే పొరపాటే.... ఈ శునకానికి నిజంగా క్రూ కార్డు (విమాన సిబ్బందికి ఇచ్చే కార్డు) ఉంది. క్యాలీ అనే ఈ మూడేళ్ల కుక్క (పూచ్) తన యజమాని గ్రాహం మౌంట్ఫోర్డ్తో కలసి చిన్నప్పటి నుంచి ఇంగ్లండ్ అంతటా చక్కర్లు కొట్టింది. తన యజమానికి ఉన్న తేలికపాటి విమానంలో కో-పైలట్ హోదాలో 250 గంటల పాటు ఆకాశయానం చేసింది. ఇలా దాదాపు 80,467 కిలోమీటర్లు ప్రయాణించింది. దీంతో ఎయిర్‌క్రాఫ్ట్ ఓనర్స్ అండ్ పైలట్స్ అసోసియేషన్ (ఏఓపీఏ) వాళ్లు దీనికి క్రూ కార్డు జారీ చేశారు. ప్రపంచంలో ఈ కార్డు పొందిన మొదటి కుక్క క్యాలీనే. ఈ కార్డు ఉండడం వల్ల క్యాలీ ఇకపై ఇంగ్లండ్‌లోని అన్ని ఎయిర్‌పోర్టులకు విమానసిబ్బంది హోదాలో దర్జాగా వెళ్లొచ్చు. తన కో-పైలట్ కుక్క అని తెలిసి చాలామంది ఆశ్చర్యంతో చిరునవ్వు చిందిస్తుంటారని క్యాలీ యజమాని మౌంట్‌ఫోర్డ్ చెప్పాడు.