![Tray Tables Closed at The Time of Flight Landing - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/24/tray-table.jpg.webp?itok=waxB1L5R)
ఈ రోజుల్లో చాలామంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో విమాన ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే విమాన ప్రయాణం చేసేటప్పుడు పలు నిబంధనలు పాటించాలని ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. విమాన ప్రయాణంలో ధూమపానం చేయకూడదు, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలాంటి నిబంధనలలో ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్‌ను మూసివేయాలని కూడా చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి? ట్రే టేబుల్ మూసివేయకపోతే ఏమైనా జరుగుతుందా?
ఎయిర్ హోస్టోస్ హన్నా టెస్సన్(23) అమెరికాలోని కొలరాడోలో ఉంటున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలనే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రయాణికులు తాము చెప్పే సూచనలను పాటించనప్పుడు కోపం వస్తుందని అన్నారు. ప్రయాణీకులు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ మూసివేయాలని చెప్పినా, వెంటనే అమలు చేయరని ఆమె తెలిపారు. ఇలాంటి ఈ నిబంధనలను విమాన ప్రయాణికులు తప్పని సరిగా తెలుసుకోవాలని ఆమె అన్నారు.
హన్నా తెలిపిన వివరాల ప్రకారం.. విమాన ప్రమాదాలు చాలావరకూ ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఓపెన్ ట్రే టేబుల్ కారణంగా ప్రయాణికులు గాయపడే అవకాశముంది. అందుకే ట్రే టేబుళ్లను మూసి వేయాలని ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. ఆహారం అందించడం ఒక్కటే తమ పని కాదని, ప్రయాణికుల భద్రతను చూడటం కూడా తమ పనే అని హన్నా తెలిపారు. విమానం టేకాఫ్ చేయడానికి ముందు విమానంలోని భద్రతా పరికరాలను తనిఖీ చేస్తామని, అంతే కాకుండా ప్రయాణికుల వింత ప్రవర్తనపై కూడా నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment