పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు వ్యాపారం, ఇటు వినియోగదారుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఫలితంగా పేటీఎం వినియోగాన్ని తగ్గించి ప్రత్యర్ధి సంస్థల యాప్లను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 1న పేటీఎం యాప్ రోజువారి డౌన్‌లోడ్‌లు భారీగా తగ్గాయి. ఈ సమయంలో భీమ్ యూపీఐ యాప్ డౌన్‌లోడ్‌లు 49 శాతం పెరిగాయి. గూగుల్ పే యాప్ రోజువారీ డౌన్‌లోడ్‌లు 10.6 శాతం తగ్గాయి.
న్యూయార్క్‌లోని మొబైల్ అనలిటిక్స్, ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ Appfigures షేర్ చేసిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 1న 135,139గా ఉన్న పేటీఎం యాప్ డౌన్‌లోడ్‌లు ఫిబ్రవరి 19న 55 శాతం క్షీణించి 60,627కి పడిపోయాయి.
♦ భీమ్ యూపీఐ డౌన్‌లోడ్‌లు ఈ నెల మొదటి రోజున 222,439 నుండి ఫిబ్రవరి 19న 331,781కి పెరిగాయి.
♦ గూగుల్ పే రోజువారీ యాప్ డౌన్‌లోడ్‌లు 105,296 నుండి 94,163కి పడిపోయాయి.
♦ ఫోన్ పే డౌన్‌లోడ్‌లు ఫిబ్రవరి 1న 317,522 నుండి ఫిబ్రవరి 7న 503,436కి పెరిగాయి. ఫిబ్రవరి 19న 163,011కి తగ్గాయి.
డిజిటల్ చెల్లింపు లావాదేవీల కోసం వ్యాపారులు ఇతర యాప్‌లు, బ్యాంక్ అకౌంట్లకు మారడం ప్రారంభించారు. ఢిల్లీలోని బులియన్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ మాట్లాడుతూ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై వార్తలు వచ్చినప్పటి నుండి వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ యాప్‌లకు మారారు.
‘ఈ చర్య కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై మాత్రమేనని, పేటీఎం యాప్‌పై ఎటువంటి ప్రభావం లేదని మాకు తెలుసు. అయితే, ముందస్తు చర్యల్లో భాగంగా మేము మా ఖాతాలను ఇతర చెల్లింపు అగ్రిగేటర్‌లకు తరలిస్తున్నాము. చూడండి, వ్యాపారంలో నమ్మకం అనేది అత్యంత ముఖ్యమైన విషయం’అని సింఘాల్ అన్నారు.
ఈ సందర్భంగా ‘పేటీఎం యాప్ డౌన్‌లోడ్‌లలో క్షీణత వినియోగదారుల మధ్య అనిశ్చితి, నమ్మకం కోల్పోవడం ప్రతిధ్వనిస్తుంది’అని ఇండియా బ్లాక్‌చెయిన్ ఫోరమ్ కో-ఫౌండర్ శరత్ చంద్ర అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment