న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల వసూళ్ల విషయంలో అవినీతిని గణనీయంగా తగ్గించే దిశగా సిద్ధం చేసిన పలు సంస్కరణలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. పన్నుల మదింపు, వివాదాలపై అప్పీళ్లు అంశాల్లో వ్యక్తుల ప్రమేయం (ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, అప్పీల్స్) లేకుండా చేయడం వీటిల్లో ఒకటి. పారదర్శక, నీతివంతమైన, ఉచితంగా అందుబాటులో ఉండే పన్ను సేకరణ విధానం కోసం పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తెలిపారు. ‘‘పారదర్శక పన్ను విధానం– నిజాయితీపరుల గుర్తింపు’’ పేరుతో సిద్ధం చేసిన ఓ వేదికను ఆన్‌లైన్ పద్ధతిలో ఆవిష్కరించిన మోదీ మాట్లాడుతూ దేశ జనాభాలో అతితక్కువ మంది అంటే కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు కడుతున్నారని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిన వారు స్వచ్ఛందంగా ఆ పనిచేయాలని పిలుపునిచ్చారు. .
వచ్చే నెల నుంచి ఫేస్‌లెస్ అసెస్‌మెంట్..
ప్రత్యక్ష పన్నుల విధానంలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా పన్ను చెల్లింపుదారుల చార్టర్, వ్యక్తుల ప్రమేయం లేని పన్ను మదింపును అమలు చేయడం ద్వారా పన్ను చెల్లింపులను అధికం చేయడంతో పాటు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ప్రోత్సహించడం వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త సంస్కరణల ఫలితంగా పన్ను చెల్లింపుదారులు ఏ పనికోసమైనా ఐటీ కార్యాలయాన్ని, అధికారిని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడదు. చార్టర్ కూడా గురువారం నుంచే అమల్లోకి రానుండగా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ అనేది సెప్టెంబర్ 25 నుంచి అమలు కానుంది.
వ్యక్తుల పన్ను చెల్లింపులు, అప్పీళ్లు, పరిశీలన అన్నీ ఇప్పటివరకూ ఆయా వ్యక్తులున్న నగరాల్లోనే జరుగుతూండగా ఇకపై కేంద్రీకృత కంప్యూటర్ వ్యవస్థ ఐటీ రిటర్న్స్ స్వీకరిస్తుందని, నిశిత పరిశీలన అవసరమైన వాటిని తనంతట తానే యాదృచ్ఛికంగా అధికారులకు కేటాయిస్తుందని ప్రధాని వివరించారు. ఈ అధికారులు నిర్వహించే స్క్రూటినీపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏ నగరంలోని అధికారికి ఎవరి పన్ను రిటర్న్‌లు స్క్రూటినీకి వస్తాయో? ఏ అధికారి పర్యవేక్షిస్తారో తెలియదని చెప్పారు. కేంద్రీకృత కంప్యూటర్ వ్యవస్థ మాత్రమే వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తుందని, వాటికి వివరణ కూడా వ్యక్తిగతంగా కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలోనే ఇవ్వవచ్చన్నారు.
నిష్పాక్షికత పెరుగుతుంది: ఆర్థిక మంత్రి
వ్యక్తుల ప్రమేయం లేకుండా పన్నుల స్క్రూటినీ, అప్పీళ్లు వంటి సంస్కరణలతో పన్ను చెల్లింపుదారుపై నిబంధనల పాటింపు భారం తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే పన్ను వ్యవస్థలతో నిజాయితీ, నిష్పాక్షికత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పన్నుల వ్యవస్థలో ఇది చరిత్రాత్మక రోజని ఆమె అభివర్ణించారు. పన్ను చెల్లింపుదారులకు సాధికారతనివ్వడం, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గౌరవించడం అన్నది ప్రధాని విజన్ అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ అభియోగాలకు మినహాయింపు..
అంతర్జాతీయ స్థాయి కేసులు, తనిఖీ .. జప్తు చేయాల్సిన కేసులు మినహా స్క్రూటినీకి ఎంపిక చేసిన వాటన్నింటికీ ఫేస్‌లెస్ విధానం కింద మదింపు ప్రక్రియ వర్తిస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. అసెస్‌మెంట్ ఆర్డర్లన్నీ ఇకపై ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ స్కీమ్ 2019 కింద జాతీయ ఈ–అసెస్‌మెంట్ సెంటర్ ద్వారా జారీ అవుతాయని వివరించింది. స్క్రూటినీ అసెస్‌మెంట్‌కు సంబంధించిన వివరాల సేకరణ కోసం జరిపే సర్వేలను ఇకపై ఇన్వెస్టిగేషన్ విభాగం, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) డైరెక్టరేట్ మాత్రమే నిర్వహిస్తాయని సీబీడీటీ తెలిపింది.
పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరం
ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ఫేస్‌లెస్ అప్పీలు తదితర భారీ సంస్కరణలన్నీ పన్ను చెల్లింపుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రధాని ఆకాంక్షిస్తున్నట్లుగా స్వావలంబన సాధించేందుకు ఈ విధానం మరింతగా తోడ్పడగలదు.
– ఉదయ్ కోటక్, ప్రెసిడెంట్, సీఐఐ
మైలురాయి..
వ్యవస్థాగత సంస్కరణలకు సంబంధించి ఇది మరో మైలురా యి. ఇది పన్ను చెల్లింపుదారుల్లో మరింతగా విశ్వాసాన్ని పెంపొం దించగలదు.
– సంగీతా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్కీ
సరైన దిశగా సంస్కరణలు
ప్రభుత్వం, పన్ను చెల్లింపుదారుల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసం పెంపొందించేవిగా, భయాందోళనలను కలిగించని విధంగా ఉండాలి. ఆ దిశగా ఈ–అసెస్‌మెంట్ మొదలైనవి సరైన సంస్కరణలు.
– దీపక్ సూద్, సెక్రటరీ, అసోచాం
చరిత్రాత్మకం
ప్రత్యక్ష పన్నుల విధానంలో తీసుకువచ్చిన మార్పులు చరిత్రాత్మకమైనవి. నిజాయితీగా పన్ను చెల్లించే వారిని గౌరవించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ట్యాక్స్‌పేయర్స్ చార్టర్ వంటివి భారతీయ పన్ను విధానాన్ని మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకు ఉంది.
– అమిత్ షా, హోంశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment