ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాబెటిక్, క్యాన్సర్, గుండె సంబంధిత దీర్ఘకాలిక ఔషధాలన్నీ చౌక ధరలకే లభించనున్నాయి. ఆయా మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)ను హైదరాబాద్‌లోని ఐఐసీటీ అభివృద్ధి చేయనుంది. స్థానిక రసాయనాలు, వనరులతో అభివృద్ధి చేసిన ఏపీఐలతో తుది ఔషధ తయారీ ఖర్చు తగ్గుతుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ఇప్పటికే 53 రకాల దీర్ఘకాలిక ఔషధాల ఏపీఐలకు కేంద్రం ఓకే చెప్పిందని ఆయన తెలిపారు. తొలి దశలో కరోనా వైరస్ నియంత్రణ మందుల ఏపీఐలను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే 3 నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
చైనా దిగుమతిని తగ్గించడమే లక్ష్యం..
ప్రస్తుతం దేశీయ ఫార్మా కంపెనీలు ఔషధాల తయారీకి అవసరమైన ఇంటర్మీడియట్స్‌ను 68–70 శాతం వరకు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో మందుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారం చూపించేందుకే దేశీయంగా లభ్యమయ్యే ముడి పదార్థాలు, వనరులతోనే ఇంటర్మీడియట్స్‌ను తయారు చేసి.. ఔషధా లను అభివృద్ధి చేయాలని ఐఐసీటీ నిర్ణయించింది. పేటెంట్ పూర్తి కాకముందే సంబంధిత డ్రగ్ మేకర్స్ నుంచి వీటి తయారీకి అనుమతి తీసుకుంటారు. స్థానికంగానే రసాయనాలు, ముడి పదార్థాలు, టెక్నాలజీని అభివృద్ధి చేస్తారు. ‘‘తుది ఔషధాల తయారీ కోసం సన్‌ఫార్మా, సిప్లా వంటి ఫార్ములేషన్ ఫార్మా కంపెనీలతో ఐఐసీటీ ఒప్పందం చేసుకుంది. 3–5 వేల వరకు ధర ఉండే ఔషధాలను వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకు తీసుకురావటమే ప్రధాన లక్ష్యమని చంద్రశేఖర్ తెలిపారు.
వైజాగ్‌లో డైక్లోరో యాసిడ్ తయారీ..
రక్త కణాలు, విటమిన్లకు సంబంధించిన ఔషధాల తయారీలో ఉపయోగించే లిపోయిక్ యాసిడ్ ఏపీఐ తయారీకి డైక్లోరో యాక్టినో యాసిడ్ అనే ముడి పదార్థం కావాలి. ప్రస్తుతం దీన్ని ఫార్మా కంపెనీలు పెద్ద మొత్తంలో చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ఐఐసీటీ ఏం చేస్తుందంటే.. పారిశ్రామిక ఉత్పత్తుల నుంచి వెలువడే క్లోరిక్ గ్యాస్, ఓలినమైట్ అనే రెండు రసాయన మిశ్రమాలతో డైక్లోరో యాసిడ్‌ను తయారు చేస్తుంది. దీన్ని బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ ఫార్మా కంపెనీకి విశాఖపట్నంలో ఉన్న అనుబంధ యూనిట్‌లో ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడి నుంచే ఫార్మా కంపెనీలకు అవసరమైన డైక్లోరో యాక్టినో యాసిడ్‌ను అందించనుంది. దీంతో ముడిసరుకు ధర రెండు రెట్లు తగ్గిపోతుంది.
రెమిడిస్‌విర్ ధర తక్కువలోనే..
ప్రస్తుతం కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాల తయారీకి అవసరమైన ఏపీఐల అభివృద్ధి మీద దృష్టిసారించింది. ఇప్పటికే రెమిడిస్‌విర్, ఫెపిఫిరావిర్, ఆర్బిటాల్ ఏపీఐలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ.4–5 వేలుగా ఉన్న రెమిడిస్‌విర్ ధర.. వెయ్యి లోపు తీసుకొచ్చేందుకు స్థానిక వనరులతో ఇంటర్మీడియట్స్‌ను తయారు చేస్తోంది. దీంతో పాటూ సాక్వినావేర్, డపాలిప్లోజన్, డలార్జిన్ వంటి కరోనా మెడిసిన్స్ మాలిక్యూల్స్‌ను కూడా డెవలప్ చేస్తోంది. వచ్చే 3 నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఎంపిక చేసిన 53 ఏపీఐలతో కొన్ని.. అమోక్సిసిలిన్, సెపాలెక్సిన్, డోక్సిసైలిన్, ఆస్ప్రిన్, రిఫాంపిసిన్, విటమిన్ బీ1, బీ6, సిప్రోఫ్లోక్సిన్, కార్బిడోపా, పారాసిటమాల్, లూపినవిర్, రిటోనవిర్. వీటి తయారీకి మూడేళ్ల సమయం పడుతుంది. సుమారు 15 మంది శాస్త్రవేత్తల బృందం పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment