‘సగం ధరకే సొంతిల్లు’.. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి | Property Frauds And Real Estate Scams In India | Sakshi
Sakshi News home page

‘సగం ధరకే సొంతిల్లు’.. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి

Published Sat, Dec 10 2022 6:52 AM | Last Updated on Sat, Dec 10 2022 7:57 AM

Property Frauds And Real Estate Scams In India - Sakshi

ప్రీలాంచ్, బై బ్యాక్, యూడీఎస్, అన్‌లాకబుల్‌ స్పేస్, రెంటల్‌ స్కీమ్‌.. ఇలా రకరకాలుగా నివాస, వాణిజ్య సముదాయాలలో ఆఫర్ల పేరిట కొనుగోలుదారులకు ఎర వేస్తున్న నిర్మాణ సంస్థలు అనేకం. సెంటు భూమి లేకుండానే ఆకాశంలో మేడలు కడుతున్నామని నమ్మించి నట్టేట ముంచేస్తున్నాయి.

ఏ కంపెనీలు ఏ తరహా మోసాలకు పాల్పడుతున్నాయనే ప్రస్తావన కాసేపు పక్కన పెడితే.. అసలు ప్రీలాంచ్‌ మోసాలకు కారణం ఎవరు? చిన్న వస్తువు కొంటేనే బ్రాండ్, ధర, ఎక్స్‌పైరీ వంటి వివరాలన్నీ తెలుసుకునే కొనుగోలుదారులు.. జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలులో ఎందుకు పునఃపరిశీలన చేసుకోవటం లేదు? సగం ధరకే ఫ్లాట్‌ అనగానే గుడ్డిగా నమ్మేసి కష్టార్జితాన్నంతా బిల్డర్‌ చేతిలో పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్‌? 

సాక్షి, హైదరాబాద్‌: భవన నిర్మాణ రంగానికి పునాది నమ్మకం. ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించేటప్పుడు అందులోని ఫ్లాట్లన్నింటినీ అమ్మగలననే నమ్మకం బిల్డర్‌కు, ఆ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేసి అందించగలడనే నమ్మకం కొనుగోలుదారునికి ఉండాలి. అప్పుడే ప్రతికూల సమయంలోనూ బిల్డర్, కస్టమర్లు ఇద్దరూ ఆనందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలో కొరవడింది ఈ నమ్మకమే.రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే బిల్డర్లు, స్వలాభమే ఆశించే భూ యజమానులు, సగం ధరకే సొంతిల్లు కావాలనుకునే కస్టమర్లు.. వీరందరూ అత్యాశతో పరిశ్రమకు మచ్చ తెస్తున్నారు. 

నిధుల మళ్లింపుతో.. 
వ్యాపారంలో షార్ట్‌కర్ట్‌ దురుద్దేశంతో సాహితీ వంటి కొంతమంది బిల్డర్లు ప్రీలాంచ్‌ పేరుతో సగం ధరకే ఫ్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేస్తూ హోమ్‌ బయ్యర్లను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా సమీకరించిన సొమ్మును బిల్డర్లు ఇతర ప్రాజెక్ట్‌లకు, వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారు. సగం ధరకే అమ్మిన సొమ్ముతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేక చతికిలపడిపోతున్నారు. అత్యాశ కలిగిన బిల్డర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ సక్రమంగా ఉన్న పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారు. విలువలతో కూడిన వ్యాపారం చేసే డెవలపర్లకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. 

అధ్యయనం చేయకుండానే.. 
ప్రీలాంచ్, యూడీఎస్‌ స్కీమ్‌ల పేరిట కస్టమర్లను మోసం చేసే వందలాది మంది బిల్డర్ల పుట్టుకకు కారణం కస్టమర్లే. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సగం ధరకే ఫ్లాట్‌ అనగానే నమ్మేసి, అత్యాశకు పోయి బిల్డర్లకు సొమ్ము సమర్పించుకునే కస్టమర్లు ఉన్నంతకాలం ప్రీలాంచ్‌ చీడపురుగులు వస్తూనే ఉంటారు. అత్యాశ కలిగిన కస్టమర్లే లేకపోతే ప్రీలాంచ్‌ డెవలపర్లు మొగ్గలోనే వాడిపోతారు. ప్రీలాంచ్‌ పేరిట డబ్బులు వసూలు చేసే బిల్డర్లను శిక్షించి నట్టుగానే వారిని ప్రోత్సహించే కొనుగోలుదారులనూ శిక్షించాల్సిన అవసరం ఉంది. 

కొనేముందు గమనించాల్సినవివే 

► నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. 

ప్రాజెక్ట్‌ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి. 

డెవలపర్‌ ప్రొఫైల్, ఆర్ధిక సామర్థ్యం తెలుసుకోవాలి.
 
గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి. 

పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదో తెలుసుకోవాలి. 

ప్రాజెక్ట్‌ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి. 

డెవలపర్‌ లేదా కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి.  

కస్టమర్లూ శిక్షార్హులే.. 
లంచం తీసుకోవటం ఎంత నేరమో.. ఇవ్వటమూ అంతే నేరం. అలాగే ప్రీలాంచ్‌ స్కీమ్‌లతో ప్రజలను మోసం చేస్తున్న బిల్డర్లది ఎంత తప్పో.. ఆయా స్కీమ్‌లను నమ్మి బిల్డర్లను ప్రోత్సహించే కస్టమర్లదీ అంతే తప్పు. లంచం విషయాలలో ఎలాగైతే ఇద్దరూ శిక్షించబడతారో ప్రీలాంచ్‌ కేసుల్లోనూ అటు బిల్డర్, ఇటు కస్టమర్‌ ఇద్దరూ శిక్షార్హులే. – రవీందర్‌ రెడ్డి, ఫౌండర్, చైర్మన్‌ జనప్రియ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement