టాటా కలల ఆస్పత్రి ప్రారంభం.. ఇక్కడ వైద్యం ఎవరికో తెలుసా? | Ratan Tata launches new animal hospital in Mumbai | Sakshi
Sakshi News home page

టాటా కలల ఆస్పత్రి ప్రారంభం.. ఇక్కడ వైద్యం ఎవరికో తెలుసా?

Published Tue, Jul 2 2024 8:04 PM | Last Updated on Tue, Jul 2 2024 8:47 PM

Ratan Tata launches new animal hospital in Mumbai

దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన బిలియనీర్‌ వ్యాపార వేత్తలలో రతన్ టాటా ఒకరు. దాతృత్వం, జ్ఞాన సంపద, వ్యాపార నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన రతన్ టాటాకు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ ఉంది. మూగ జీవాలను ప్రేమించే ఆయన వాటి కోసం నిర్మించిన ప్రత్యేక ఆస్పత్రిని తాజాగా ప్రారంభించారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెంపుడు జంతువుల ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు టాటా ట్రస్ట్‌ల చీఫ్‌ రతన్‌ టాటా ప్రకటించారు. 'వుయ్‌ ఆర్‌ ఓపెన్' అనే క్యాప్షన్‌తో పాటు వైద్యులతో తాను ముచ్చటిస్తున్న ఫొటోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. జంతువుల పట్ల సానుభూతితో ఉండే టాటా గ్రూప్ దాని గురించి అవగాహన పెంచడానికి అనేక ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. అదే బాటలో కొనసాగుతూ దేశంలోనే అతిపెద్ద జంతు వైద్యశాలలలో ఒకదాన్ని ప్రారంభించింది.

టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ను ముంబైలో 2.2 ఎకరాలలో రూ. 165 కోట్ల ఖర్చుతో నిర్మించారు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఇతర చిన్న జంతువులకు ఇక్కడ వైద్యం అందిస్తారు. ఇది 24x7 పని చేస్తుంది.  “నేడు మూగ జీవాలు కుటుంబ సభ్యుల మాదిరిగా మారిపోయాయి. జీవితాంతం అనేక పెంపుడు జంతువుల సంరక్షకుడిగా ఈ ఆసుపత్రి అవసరాన్ని నేను గుర్తించాను" అని రతన్ టాటా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ చెప్పారు.

జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఈ కొత్త ఆసుపత్రి  రాయల్ వెటర్నరీ కాలేజ్ లండన్‌తో సహా ఐదు యూకే వెటర్నరీ స్కూల్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. మల్టీడిసిప్లినరీ కేర్‌తో పాటు సర్జికల్, డయాగ్నోస్టిక్, ఫార్మసీ సేవలను ఆసుపత్రి అందిస్తుంది. నాలుగు అంతస్తులు ఉండే ఆసుపత్రి భవనంలో 200 జీవులకు వైద్యం అందించే సదుపాయం ఉంది. దీనికి బ్రిటిష్ పశువైద్యుడు థామస్ హీత్‌కోట్ నాయకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement