శక్తికాంత దాస్
ముంబై: ఆర్థిక వ్యవస్థలో ప్రజలు అందరినీ భాగస్వాములను చేయడం, ఈ సేవలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) విధాన ప్రాధాన్యతగా కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి మహమ్మారి కరోనా సవాళ్లు తొలగిపోయిన తర్వాత కూడా ఈ పాలసీకి ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగుతుందని దాస్ పేర్కొన్నారు. దేశ సుస్థిర అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు ఇది ఎంతో కీలకమని కూడా ఒక ఇంటర్వూ్యలో గవర్నర్ స్పష్టం చేశారు. డిజిటల్ మీడియంసహా ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయడం, లొసుగులు లేకుండా చర్యలు తీసుకోవడం, సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత, తగిన విధానాలు అవగాహన ద్వారా ఫైనాన్షియల్ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడం వంటి అంశాలు ఎంతో కీలకమని అన్నారు. ఫైనాన్షియల్ రంగంలో కీలక స్థానాల్లో ఉన్న వారి అందరికీ ఆయా విభాగాల్లో పురోగతి సాధించే బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు.
త్వరలో ఇండెక్స్
గడచిన దశాబ్ద కాలంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై ఆర్‌బీఐ ప్రధానంగా దృష్టి పెట్టిందని గవర్నర్ వివరించారు. బ్యాంకింగ్ సేవలను, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు దగ్గర చేసి, ఎకానమీలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి కృషి జరుగుతోందని అన్నారు. కేంద్రం ప్రారంభించిన ప్రధాని జన్ ధన్ యోజన పథకాన్ని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఏ స్థాయిలో విస్తరిస్తోందన్న విషయాన్ని తెలుసుకోడా నికి నిర్మాణాత్మకంగా, కాలాలవారీగా ఫైనాన్షి యల్ ఇన్‌క్లూజన్ ఇండెక్స్ (ఎఫ్‌ఐఐ)ను తీసుకురావాలన్న నిర్ణయం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో ఆర్‌బీఐ ఈ సూచీని వెలువరిస్తుందన్నారు. మూడు అంశాలపై ఈ ఇండెక్స్ ప్రధానంగా దృష్టి పెడుతుం దని తెలిపారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ విస్తరణ, వినియోగం, ఇందుకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు ఇందులో ఉంటాయని శక్తికాంద్ దాస్ వివరించారు.
ప్రభుత్వ సేవలకు భరోసా
మహమ్మారి కష్టాల సమయంలో ప్రజలకు సకాలంలో సేవలు అందించడానికి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఎంతో దోహపడిందన్నారు. ప్రత్యేకించి ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు పథకాల ద్వారా నగదు చెల్లింపులను సకాలంలో జరగడానికి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో పురోగతే కారణమన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 54 మంత్రిత్వశాఖల పరిధిలో అమలవుతున్న దాదాపు 319 ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు రూ.5.53 లక్షల కోట్ల చెల్లింపులు డిజిటల్‌గా జరిగాయన్నారు. ప్రభుత్వ రుణ నిర్వహణలో కీలకమైన ఆర్‌బీఐ, ద్రవ్య విధానాలు వేగవంతమైన బదలాయింపులకు దోహదపడిందని, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ కొనసాగడానికి చర్యలు తీసుకుందని వివరించారు.
ఇంటర్వ్యూలో మరిన్ని ముఖ్యాంశాలు..
- ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు భర్తీకి ఆర్‌బీఐ నగదు ముద్రణ సరికాదు. ఇది ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ తరహా పద్దతిని పూర్తిగా తొలగిండచం జరిగింది. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 2003 కూడా దీనిని తిరస్కరించింది.
- రెండు నెలలుగా 6 శాతంపైగా కొనసాగుతున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) అదుపులోనికి (ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో నిర్ణయానికి ప్రాతిపదికన అయిన సీపీఐ పెరుగుదల కేంద్రం నిర్దేశాల ప్రకారం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి) వస్తుంది. సరఫరాల వైపు సవాళ్లు అప్పటికి పూర్తిగా తొలగిపోతాయని విశ్వసిస్తున్నాం.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను 10.5 శాతం నుంచి తగ్గించాల్సిన అవసరం ప్రస్తుతం లేదు.
- కోవిడ్ ప్రేరిత సవాళ్ల ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటోంది. వ్యవస్థ లో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగిన స్థాయిలో ఉండేట్లు చర్యలు తీసుకోవడం, బ్యాంకుల వద్ద కొనసాగించాల్సిన నగదు నిల్వల నిష్పత్తి మినహాయింపులు, ప్రాధాన్యతా రంగాలకు సకాలంలో తగిన ద్రవ్య లభ్యత ఉండేట్లు చూడ్డం వంటివి ఇందులో ఉన్నాయి.
- చెల్లింపులు అన్న పదం ఎకానమీలో కీలకం. ఈ వ్యవస్థ మరింత పటిష్ట పడ్డానికి పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటుచేస్తున్నాం. ఇది మూడవ అంచె నుంచి ఆరవ అంచె వరకూ అన్ని కేంద్రాల్లో, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో చెల్లింపుల వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఆర్‌బీఐ, బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌లు సంయుక్తంగా ఈ నిధిని నిర్వహిస్తాయి.
- వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ అన్ని స్థాయిల్లో ఎంతో అవసరం. ఈ భరోసా ను కల్పించడంవల్ల డిజిటల్‌సహా ఆర్థిక సేవలు మరింత విస్తృతమవుతాయి.
- ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడం అవసరం. ఈ లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్రాలు (సీఎఫ్‌ఎల్) 2024 నాటికి మారుమూల స్థాయిలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందిస్తాయి. 15 రాష్ట్రాల్లో విద్యా బోర్డులు కూడా ఈ అంశాన్ని విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
- వ్యక్తులు అందరికీ బ్యాంకింగ్ అకౌంట్లు అవసరం. రుణాలు, పెట్టుబడులు, బీమా, పెన్షన్ వంటి అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్టులూ బ్యాంకింగ్ అకౌంట్ల ద్వారా జరిగేలా పురోగతి జరగాలి.
Comments
Please login to add a commentAdd a comment