ముంబై: కస్టమర్ల నుంచి విస్పష్టంగా సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని కార్డ్ కంపెనీలను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దీన్ని ఉల్లంఘించిన పక్షంలో కస్టమర్‌కు వేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. బాకీల వసూలు కోసం కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు దిగరాదంటూ కార్డుల సంస్థలు, థర్డ్ పార్టీ ఏజెంట్లకు ఆర్‌బీఐ సూచించింది.
2022 జూలై 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఎవరి పేరు మీదైనా అడగకుండానే కార్డు జారీ అయితే, వారు ఆ విషయంపై సదరు కార్డు సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. కంపెనీ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుకు వాటిల్లిన నష్టాన్ని (సమయం, వ్యయాలు, మానసిక ఆవేదన తదితర అంశాలు) పరిగణనలోకి తీసుకుని కార్డు జారీ సంస్థ చెల్లించాల్సిన పరిహారాన్ని అంబుడ్స్‌మన్ నిర్ణయిస్తారు.
రూ. 100 కోట్లకు పైగా నికర విలువ గల కమర్షియల్ బ్యాంకులు స్వతంత్రంగా లేదా కార్డులు జారీ చేసే ఇతర బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలతో కలిసి క్రెడిట్ కార్డు వ్యాపారం ప్రారంభించవచ్చు. స్పాన్సర్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకులతో ఒప్పందం ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులు ఇవ్వొచ్చు. ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్‌బీఎఫ్‌సీలు .. డెబిట్, క్రెడిట్ కార్డులు మొదలైనవి జారీ చేయకూడదు. కార్డు జారీ సంస్థలు/వాటి ఏజెంట్లు.. బాకీల వసూలు విషయంలో క్రెడిట్ కార్డుహోల్డర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు పట్ల మౌఖికంగా గానీ భౌతికంగా గానీ ఏ విధంగాను బెదిరించడం లేదా వేధింపులకు పాల్పడకూడదని ఆర్‌బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment