No updates
-
అడగకుండా కార్డులు జారీ చేయొద్దు
ముంబై: కస్టమర్ల నుంచి విస్పష్టంగా సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని కార్డ్ కంపెనీలను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దీన్ని ఉల్లంఘించిన పక్షంలో కస్టమర్‌కు వేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. బాకీల వసూలు కోసం కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు దిగరాదంటూ కార్డుల సంస్థలు, థర్డ్ పార్టీ ఏజెంట్లకు ఆర్బీఐ సూచించింది. 2022 జూలై 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఎవరి పేరు మీదైనా అడగకుండానే కార్డు జారీ అయితే, వారు ఆ విషయంపై సదరు కార్డు సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. కంపెనీ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుకు వాటిల్లిన నష్టాన్ని (సమయం, వ్యయాలు, మానసిక ఆవేదన తదితర అంశాలు) పరిగణనలోకి తీసుకుని కార్డు జారీ సంస్థ చెల్లించాల్సిన పరిహారాన్ని అంబుడ్స్‌మన్ నిర్ణయిస్తారు. రూ. 100 కోట్లకు పైగా నికర విలువ గల కమర్షియల్ బ్యాంకులు స్వతంత్రంగా లేదా కార్డులు జారీ చేసే ఇతర బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలతో కలిసి క్రెడిట్ కార్డు వ్యాపారం ప్రారంభించవచ్చు. స్పాన్సర్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకులతో ఒప్పందం ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులు ఇవ్వొచ్చు. ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్బీఎఫ్సీలు .. డెబిట్, క్రెడిట్ కార్డులు మొదలైనవి జారీ చేయకూడదు. కార్డు జారీ సంస్థలు/వాటి ఏజెంట్లు.. బాకీల వసూలు విషయంలో క్రెడిట్ కార్డుహోల్డర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు పట్ల మౌఖికంగా గానీ భౌతికంగా గానీ ఏ విధంగాను బెదిరించడం లేదా వేధింపులకు పాల్పడకూడదని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
Sarkaru Vaari Paata: అప్డేట్ లేదు
‘సర్కారువారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని హీరో మహేశ్‌బాబు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావించారు. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా మే 31న ‘సర్కారువారి పాట’ నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదు.. ఆ రోజు అన్ని వేడుకలు రద్దు చేసిన ట్లు మహేశ్‌బాబు టీమ్ అధికారికంగా పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ‘సర్కారువారి పాట’ నుంచి ఎలాంటి అప్డేట్ను విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించారు. సినిమా అప్డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని వారు భావిస్తున్నారు. అప్డేట్ విషయంలో ఎలాంటి అనధికారిక, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయకూడదు.. ఏదైనా సమాచారం ఉంటే యూనిట్ నుంచి అధికారికంగా వస్తుంది’’ అని మహేశ్‌బాబు టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారువారి పాట’లో కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌తో కలిసి ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. -
టీడీపీ అధికారిక వెబ్సైట్ మూతపడిందా?
♦ 2015 అక్టోబర్ 14 నుంచి అప్డేట్ కాని వెబ్సైట్ ♦ ఏపీలో ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ప్రచారాలు ♦ తెలంగాణ టీడీపీకి సమాచార లేమి ♦ ఎక్కడా కనిపించని గ్రేటర్ ఎన్నికల సమాచారం సాక్షి, హైదరాబాద్: ‘‘సెల్‌ఫోన్‌ను హైదరాబాద్‌కు తెచ్చింది నేనే! దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొచ్చింది నేనే!! అందరి జాతకాలు నా ల్యాప్‌టాప్‌లో భద్రంగా ఉన్నాయి... బిల్‌గేట్స్, సత్య నాదెళ్ల నన్ను కలిసేందుకు అపాయింట్మెంటు అడుగుతారు..’’ అంటూ అధునాతన సాంకేతిక విప్లవంపై అలవిగాని మాటలు చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత పార్టీ అధికారిక వెబ్ సైట్‌ను అటకెక్కించినట్టున్నారు. ‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రణాళికలు, నాయకుల టూర్ షెడ్యూల్స్, బాబు రోడ్‌షోల వివరాలు తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను క్లిక్ చేసే తమ్ముళ్లు నిరుటి సమాచారం చూసుకొని తెల్లబోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నట్టుగానే తెలుగుదేశం పార్టీకి అధికారికంగా ‘తెలుగుదేశం.ఓఆర్జీ’ డొమైన్‌తో ఓ వెబ్సైట్ ఉంది. 1998 మే 25న రిజిస్టర్ అయిన ఈ వెబ్సైట్ గత సంవత్సరాంతం వరకు చురుగ్గానే పనిచేసేది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నడిచినా, హెలికాప్టర్ ఎక్కినా... చివరికి ఇతర దేశాల పర్యటనకు వెళ్లినా వెబ్సైట్లో ఫొటోలు, వార్తా కథనాల క్లిప్పింగ్‌లు కనిపించేవి. వెబ్‌లో అప్డేట్ కాని సమాచారం అయితే ఏమైందో తెలియదు గానీ.. 2015 అక్టోబర్ 14 నుంచి ఈ వెబ్సైట్లో తెలుగుదేశం సమాచారం అప్డేట్ కావడం లేదు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ డొమైన్‌ను క్లిక్ చేయగానే లేటెస్ట్ న్యూస్ అనే ఆప్షన్ కింద ‘నేటి వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు- 14.10.2015’ అని రాసిన క్యాప్షన్ కనిపిస్తుంది. అంటే అక్టోబర్ 14 నాటి వార్తా కథనాల క్లిప్పింగ్‌లను అప్లోడ్ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ సిబ్బంది తరువాత ఈ సైట్‌ను చూడటమే మానేశారన్నమాట. దీనిపై పూర్తి సమాచారం తెలుసుకోగా 2016 మే 24 వరకు ఈ వెబ్సైట్ నిర్వహణకు చివరి గడువుగా తేలింది. ఆర్వీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ద్వారా టి. శ్రీనివాస్‌రావు తెలుగుదేశం ఆఫీసు కేంద్రంగానే ఈ వెబ్‌సైట్‌ను రిజిస్టర్ చేసినప్పటికీ.. ఎందుకు అప్డేట్ చేయడం మానేశారనే సమాచారం లేదు. 37 రోజుల నుంచి డొమైనర్ సైట్‌ను ఓపెన్ చేయలేదని హు ఈస్ డాట్నెట్ ద్వారా తెలుస్తుంది. కానరాని గ్రేటర్ ఎన్నికల సమాచారం దేశానికి ఐటీని తీసుకొచ్చానని చెప్పుకొనే చంద్రబాబు సొంత పార్టీ వెబ్‌సైట్‌ను ఓ ప్రైవేటు కంపెనీ రిజిస్టర్ చేస్తే... 37 రోజులుగా సైట్‌ను ముట్టుకునే వారు లేరు. ఇక మూడు నెలల నుంచి సమాచారం అప్డేట్ కాకపోవడంతో ఈ సైట్‌ను చూసేవారు లేకుండా పోయారని తెలుస్తోంది. కాగా ఏపీలో చంద్రబాబుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ వెబ్సైట్ ప్రచారం చేస్తోంది. కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం గతేడాది అక్టోబర్‌కు ముందు సమాచారాన్నే చూసుకునే పరిస్థితి నెలకొంది. తెలంగాణ తెలుగుదేశం నాయకులు గ్రేటర్ ఎన్నికల సమాచారం చూసుకుందామన్నా వెబ్సైట్ అప్డేట్ కాకపోవడంతో ఉసూరుమంటున్నారు.